సోనమ్ కపూర్ అహూజా, కత్రీనా కైఫ్
ఒకరి నమ్మకం.. ఇంకొకరికి పిచ్చిగా అనిపించొచ్చు. నవ్వులాటగానూ తోచొచ్చు. అలాంటి నమ్మకాలు సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్స్.. గిమ్మిక్స్ చేసే వాళ్లకు ఎక్కువ. అవి సెల్యూలాయిడ్ సెంటిమెంట్స్‌గానే మిగిలిపోవట్లేదు.. ఆ సెలెబ్రిటీ రియల్ లైఫ్‌లోనూ భాగమవుతున్నాయి. ఎగ్జాంపుల్స్ వీళ్లే...! ఎవరి పిచ్చి వారికి ఆనందం.. ఈ ఊసుపోని కబుర్లను మేం పోగేసుకు రావట్లే మరి.. ఆ పిచ్చిలో పడి!
ఎనిమిదే కావాలి..
బిహైండ్ ది స్క్రీన్ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో రణ్‌బీర్ కపూర్! ఆ బాబుక్కూడా ఓ సెంట్‌మెంట్ ఉండండోయ్. అది వాళ్లమ్మ నీతూ సింగ్ జన్మదిన తేదీ. అది ఎనిమిది. తాను ఏ కొత్త పని మొదలుపెట్టాలన్నా.. ఎక్కడికి వెళ్లాలనుకున్నా.. ఎనిమిదో తేదీనే మొదలుపెడ్తాడు.. వెళ్తాడు. తన దగ్గరున్న కార్ల నంబర్ కూడా ఎనిమిది వచ్చేలానే చూసుకుంటాడు. అదీ ఆ అబ్బాయి సెంట్‌మెంట్!
పడితేనే హిట్.. ..ఎక్కడండీ.. ఎవరండీ..? అని అంత ఆత్రం ఎందుకండీ..? ఎక్కడంటే మరి.. షూటింగుల్లోనే. ఎవరంటే మరి.. సోనమ్ కపూర్ అహూజా. షూటింగ్ అప్పుడు సెట్స్‌లో ఒక్కసారైనా ఆమె కిందపడితే ఆ సినిమా సూపర్ హిట్టే అట. అలా ఒకట్రెండు సినిమా సెట్స్‌లో ఆమె పడితే ఆ సినిమాలు హిట్ అయ్యాయని.. అప్పటి నుంచి ఆ నమ్మకాన్ని.. సెంట్‌మెంట్‌ను వానిటీ వ్యాన్‌లో పెట్టుకుని తిరుగుందని బాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు.
ఓ నిమ్మకాయ.. నాలుగు మిరపకాయలు.... అది బెంగాలీ బ్యూటీ బిపాశా బసు సెంటిమెంట్. తన ఇంటి ప్రధాన గుమ్మాలు, కార్లు.. ఇలా పరుల దృష్టి పడుతుంది అని అనుమానమున్న ప్రతి చోటా అలా నిమ్మకాయలు, మిరపకాయలను ఓ ఇనుప వైరుకి గుచ్చి కడుతుందట బిపాశా. అవి దుష్టదృష్టి నుంచి తనను, తన ఇంటిని కాపాడుతాయనే గట్టి నమ్మకం ఆమెదని బిపాశా సన్నిహితుల చెప్పే మాట.
దేవుడి దయ.... మీద కత్రీనా కైఫ్‌కు మహావిశ్వాసం. అందుకే ఆమె నటించిన ప్రతి సినిమా విడుదలకు ముందు విధిగా ముంబైలోని సిద్ధివినాయకుడి గుడి, మౌంట్ మేరీ చర్చ్, అజ్మీర్‌లోని షరీఫ్ దర్గా.. ఇలా మూడింటినీ దర్శించుకుని వస్తుందట. ఆ దర్శనాల వల్ల తన సినిమా హిట్ అవుతుందని ఆమె నమ్మకం.
కూర్చుంటేనే వరిస్తుంది..
స్పోర్ట్స్ అంటే అభిషేక్ బచ్చన్ ప్రాణం పెడ్తాడని బాలీవుడ్‌కే కాదు.. భారతదేశంలోని అతని అభిమానులు అందరికీ తెలుసు. క్రికెట్ అంటే క్రేజ్ అతనికి. ఎంతంటే.. వెర్రి నమ్మకాలను క్రియేట్ చేసేంత! క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు అతను గ్యాలరీలోనైనా.. ఇంట్లో అయినా.. కూర్చున్న చోట నుంచి కదలడట.. మ్యాచ్ అయిపోయేంత వరకు. ఏమట పాపం? అని అడక్కండి! తాను కదిలితే తన ఫేవరెట్ టీమ్ ఓడిపోతుందని భయమట పాఫం! దీనికి లాజిక్ కూడా చెప్తాడు ఆ హీరో.. అస్తమానం అటూ ఇటూ కదులుతూ.. తిరుగుతూ ఉంటే నెగెటివ్ ఎనర్జీ అన్ని దిక్కులకు పాకి అది టీమ్ మీద ప్రభావం చూపుతుంది అంటూ! ‘ఓహో.. తమరు అలా ఆ నెగెటివ్ ఎనర్జీని కుర్చీకి కట్టేస్తారన్నమాట’ అని అభిమానులు గాట్ హిజ్ పాయింట్ అన్నమాట.
నాట్ ఆన్ థర్స్‌డేస్..
బాలీవుడ్ డాన్స్ కింగ్.. గోవిందా తెలుసు కదా! సెంటిమెంట్లలో అతనిదొక విధము. గురువారాలు గోవిందాకు అచ్చిరావుట. అదొక్క నమ్మకమే కాదు.. జ్యోతిష్యుడి సలహా సంప్రదింపులు లేనిదే ఏ పనీ చేయడుట. ఆఖరుకు క్రాఫ్ చేయించుకోవాలన్నా.. హెయిర్ వీవింగ్ చేయించుకోవాలన్నా జ్యోతిష్యుడు వారం, వర్జ్యం చూసి ఘడియలు లెక్కబెట్టి ముహూర్తం నిర్ణయించాల్సిందే! అంతెందుకు షూటింగ్‌లో కెమెరా ముందు ఏ యాంగిల్‌లో నిలబడాలో గోవిందా సర్‌కు డైరెక్టర్ కాదు చెప్పాల్సింది.. సర్ ఫ్యామిలీ జ్యోతిష్యుడు చెప్పాలి. ఇదండీ ఇతని సంగతి!
Comments
Please login to add a commentAdd a comment