
దర్శకుడు అనురాగ్ కశ్యప్
కొందరు వ్యక్తులు తన సమయాన్ని అనవసరంగా వృథా చేస్తున్నారని, అలాంటి వ్యక్తులతో ఇక ఉచితంగా మాట్లాడననీ అంటున్నారు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. అందుకే ఇకనుంచి ఎవరికైనా సమయం కేటాయించాలనుకుంటే అందుకు తగ్గట్టుగా ‘చార్జ్’ చేస్తానని అంటున్నారాయన. ఈ విషయంపై అనురాగ్ ఓ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా, బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘‘కొంతమంది కొత్త వ్యక్తులకు సహాయం చేయాలనుకుని వారితో సమావేశమై నేను నా సమయాన్ని చాలా కోల్పోయాను. ఆ సమావేశాలు నాకు ఏ మాత్రం వర్కౌట్ కాలేదు కూడా. చెప్పాలంటే ఇలా చాలామందితో మాట్లాడి నేను అలసిపోయాను.
ఈ విధంగా జీవితంలో చాలా సమయాన్ని కోల్పోయాను. సక్సెస్‌కు షార్ట్ కట్స్ వెతికేవారితో, తాము క్రియేటివ్ జీనియస్‌లా ఫీలయ్యే కొందరు వ్యక్తులతో ఇకపై నేను ఉచితంగా మాట్లాలనుకోవడం లేదు. నేను ఓ స్వచ్ఛంద సేవా సంస్థను కాదలచుకోలేదు. ఇకపై ఎవరైనా నన్ను కలవాలనుకుంటే పది నుంచి పదిహేను నిమిషాలు అయితే లక్ష రూపాయలు, 30 నిమిషాలకు రెండు లక్షలు, గంట అయితే ఐదు లక్షలు చెల్లించాలి. ఒకవేళ ఎవరైనా ఇలా డబ్బులు చెల్లించలేని పక్షంలో వారు నన్ను కలవడానికి ప్రయత్నించవద్దు’’ అని ఆ నోట్‌లో పేర్కొన్నారు అనురాగ్ కశ్యప్. ఇక బాలీవుడ్‌లో వచ్చిన ‘బ్లాక్ ఫ్రైడే’, ‘ముంబై కటింగ్’, ‘బాంబే టాకీస్’ వంటి సినిమాలకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment