గోవాలో జరగనున్న 51వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (ఇఫీ) ఇటీవల విడుదలైన చిన్న చిత్రం ‘గతం’కి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ పనోరమా విభాగంలో ‘గతం’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ విభాగంలో ఈ ఏడాది ప్రదర్శితం కానున్న ఏకైక తెలుగు సినిమా ఇది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్న సినిమాల జాబితాను శనివారం ప్రకటించారు. వచ్చే జనవరి 16 నుంచి 24 వరకు జరగనున్న ఈ చలనచిత్రోత్సవాలలో భాగంగా ఇండియన్ పనోరమా విభాగం కింద భారత్ నుంచి హిందీ, ఇంగ్లిష్, తెలుగు, తమిళ సహా ఇతర భాషల చిత్రాలు 23 ఎంపికయ్యాయి.
ఇక, మెయిన్ స్ట్రీమ్ విభాగంలో తమిళ చిత్రం ‘అసురన్’ (తెలుగులో వెంకటేశ్ నటిస్తున్న ‘నారప్ప’కు మూలం), మలయాళ చిత్రం ‘కప్పేలా’, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన హిందీ చిత్రం ‘ఛిఛోరే’ ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ఇక ఇండియన్ పనోరమా విభాగంలో ఎంపికైన ‘గతం’ విషయానికి వస్తే... భార్గవ పోలుదాసు, రాకేష్ గలేభే, పూజిత ముఖ్య పాత్రల్లో నటించిన ఈ థ్రిల్లర్ చిత్రాన్ని కిరణ్ కొండమడుగుల తెరకెక్కించారు. భార్గవ పోలుదాసు, సృజన్ ఎర్రబోలు, హర్షవర్థన్ ప్రతాప్ నిర్మించారు. మొత్తం అమెరికాలోనే చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ఈ నవంబర్ 6న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయింది.
ఇండియన్ పనోరమాకు ఎంపికైన ఏకైక తెలుగు చిత్రం
Comments
Please login to add a commentAdd a comment