![Gatham Telugu Movie Review - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/7/Gatam.jpg.webp?itok=2AkM1fib)
ఓ.టి.టిలో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ తరహా కంటెంట్‌కు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఆ నమ్మకంతో రిలీజైన ఫిల్మ్ ‘గతం’. ఎన్నారైలైన ఐ.టి. ఉద్యోగులే నటిస్తూ, సమష్టిగా నిర్మిస్తూ చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది.
కథేమిటంటే..: ఆస్పత్రి మంచం మీద కోమాలో నుంచి లేచి, గతం మర్చిపోయిన ఓ అబ్బాయి (రిషి పాత్రలో రాకేశ్). అతని ప్రియురాలిగా గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించే ఓ అమ్మాయి (పూజిత). గతాన్ని తెలుసుకోవడానికంటూ వారిద్దరూ కారులో బయలుదేరతారు. మార్గమధ్యంలో, చిమ్మచీకటిలో కారు ఆగిపోతే, అపరిచిత వ్యక్తి అర్జున్ (భార్గవ పోలుదాసు) తన ఇంట్లో ఆశ్రయం ఇస్తాడు. ఆ ఇంట్లోకి వెళ్ళాక ఆ జంటకు ఎదురైన విచిత్రమైన అనుభవాలు ఏమిటి, మర్చిపోయిన ఆ గతం ఏమిటి, ఆ గతానికీ ఈ వ్యక్తులకూ సంబంధం ఏమిటన్నది కథ.
ఎలా చేశారంటే..: ‘‘ప్రతి మనిషిలోనూ ఓ సైకోపాత్ ఉంటాడు’’ అంటూ ఔత్సాహికులు చేసిన ఈ సినిమాలో నటీనటులంతా కొత్తవాళ్ళే. అపరిచిత ముఖాలే. అయినా, వెండితెరపై విలన్ పాత్రలకు సరిపోయే అర్జున్ పాత్రధారి భార్గవ ఆకట్టుకుంటారు. రిషి పాత్రధారి రాకేశ్ గొంతు, ఉచ్చారణ కళ్ళు మూసుకొని వింటే, హీరో విజయ్ దేవరకొండ గుర్తుకొస్తారు. ‘మాయాబజార్’ దర్శకులు కె.వి. రెడ్డికి ముని మనుమరాలైన పూజితారెడ్డి పాత్ర పరిధిలో ఉన్నంత మేరకు చేశారు. మిగిలిన పాత్రలన్నీ కథలో భాగంగా వచ్చిపోయేవి.
ఎలా తీశారంటే..: మొత్తం అమెరికా నేపథ్యంలోనే సాగే ఈ చిత్రంలో మనోజ్ రెడ్డి కెమెరాలో అమెరికాలో మంచుతో నిండిన లొకేషన్లు తెరపై అందంగా కనిపించాయి. సినిమాకు మరో ప్రధాన బలం శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం. థ్రిల్లర్ కథనూ, సన్నివేశాలనూ బలంగా చెప్పడంలో చరణ్ పనితనం బాగా ఉపయోగపడింది. షార్ట్ ఫిల్ముల నుంచి దర్శకుడిగా మారిన అమెరికన్ ఐ.టి. ఉద్యోగి కిరణ్ రెడ్డి మంచి పాయింట్‌ను ఎంచుకున్నారు. కానీ, అంతకు తగ్గ పటిష్ఠమైన కథనం అల్లుకోలేదనిపిస్తుంది. ఇన్ని నేరాలు జరుగుతున్నా ప్రధాన పాత్రధారి తప్ప పోలీసులెవరూ పరిశోధిస్తున్నట్టు కనపడరు. కొడుకు చేసే ఘోరాలకు తండ్రి ఎందుకు సహకరిస్తున్నాడన్న దానికీ పెద్దగా లాజిక్ లేదు. కథనంలో కొన్ని సన్నివేశాలు ముందుగా ఊహించేసే తీరులో ఉండడమూ మరో బలహీనత.
సినిమా ఫస్టాఫ్ స్లోగా సాగుతుంది. అసలు కథ మొదలైన సెకండాఫ్ చివరికొచ్చే కొద్దీ ఆసక్తి పెరుగుతుంది. కానీ, అప్పటికే ఆలస్యమైపోయిందని వీక్షకులు భావిస్తేనే కష్టం. అయితే, ఐ.టి. ఉద్యోగులు తమ ఉద్యోగాలు చేసుకుంటూనే, క్రిస్మస్ సెలవుల్లో, వీకెండ్స్ లో తీస్తూ, వీలైనంత తక్కువ బడ్జెట్‌లో, అతి తక్కువ యూనిట్‌తో చేసిన ప్రయత్నంగా కథలోని చాలా లోపాలను క్షమించ బుద్ధేస్తుంది. కమర్షియల్ లెక్కలతో కాకుండా, ప్రేమతో ప్రవాస భారతీయులు చేసిన ప్రయత్నంగా ‘గతం’ను అభినందించాలని అనిపిస్తుంది. కానీ, గ్రిప్పింగ్‌గా ఉన్న ట్రైలర్‌కు భిన్నంగా స్లోగా సాగే ఈ నూటొక్క నిమిషాల కథాకథనాన్ని అందరూ ఆనందించగలరా?
కొసమెరుపు: ‘గతం’... గుర్తు పెట్టుకోలేం! అలాగని మరిచిపోలేం!
బలాలు:
► నేపథ్య సంగీతం
► క్రై మ్, ఇన్వెస్టిగేషన్ అంశం
► సినిమా చివరి అరగంట
► భార్గవ అభినయం.
బలహీనతలు: ∙
► అంతా కొత్తవాళ్ళే కావడం
► సీన్లలోని ప్రిడిక్టబిలిటీ
► ఫస్టాఫ్‌లోని స్లో నేరేషన్
► కథ నడిపిన విధానం.
– రెంటాల జయదేవ
Comments
Please login to add a commentAdd a comment