గోపీచంద్
‘‘భీమా’ పక్కా కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. నేను చేసిన భీమా పాత్రలో చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, రొమాన్స్.. ఇలా అన్ని అంశాలున్నాయి. ఈ కథలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్‌ని హర్ష అద్భుతంగా చూపించాడు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌లో అద్భుతమైన భావోద్వేగం ఉంటుంది. సినిమా చూసి బయటికి వచ్చాక ప్రేక్షకుల మనసులో భీమా నిలిచిపోతాడనే నమ్మకం ఉంది’’ అని హీరో గోపీచంద్ అన్నారు. ఎ. హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా, ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భీమా’. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ పంచుకున్న విశేషాలు.
► ‘భీమా’ సహనిర్మాత శ్రీధర్‌గారు కోవిడ్ సమయంలో దర్శకుడు హర్షని నాకు పరిచయం చేశారు. అప్పుడో కథ చెప్పాడు హర్ష.. కథ బావుంది కానీ ఆ సమయంలో చేయకూడదని అనిపించింది. పోలీస్ నేపథ్యంలో ఏదైనా వైవిధ్యమైన కథ ఉంటే చెప్పమన్నాను. ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొన్న హర్ష ఆ తర్వాత వచ్చి ‘భీమా’ కథ చెప్పాడు. చాలా బాగా నచ్చడంతో ఓకే చెప్పాను.
► నేను గతంలో పోలీసు పాత్రలు చేశాను. ‘గోలీమార్’లో డిఫరెంట్ కాప్. ‘ఆంధ్రుడు’ లవ్ స్టోరీ నేపథ్యంలో నడుస్తుంది కానీ దాని నేపథ్యం పోలీసు కథే. ‘శౌర్యం’ కూడా భిన్నమైన కథ. ఈ మూడు చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పోలీస్ పాత్రని ‘భీమా’లో చేశాను. ఈ పోలీసు కథలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంటుంది.. అదే నాకు చాలా ఆసక్తిని కలిగించింది. హర్ష కన్నడలో చాలా అనుభవం ఉన్న దర్శకుడు. ‘భీమా’ని అద్భుతంగా తీశాడు.. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తిగా ఉంటుంది.
► ‘భీమా’ పరశురామ క్షేత్రంలో జరిగే కథ. ట్రైలర్‌లో చూపించినట్లు అఘోరాలు, కలర్ ప్యాలెట్, నేపథ్య సంగీతం వల్ల ‘అఖండ’ సినిమాతో పోలుస్తున్నారు. కానీ, ఇది పూర్తిగా వైవిధ్యమైన కథ. ఈ సినిమాలో శివుని నేపథ్యం ఉంది. పైగా సినిమా కూడా మహా శివరాత్రికి వస్తోంది. అయితే దీన్ని మేం ముందుగా ప్లాన్ చేయలేదు.. అలా కలిసొచ్చింది. శివుని ఆజ్ఞ అనుకుంటాను.
► నిర్మాత రాధామోహన్, నా కాంబినేషన్‌లో ‘పంతం’ (2018) సినిమా వచ్చింది. అప్పటి నుంచి ఆయన, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ‘పంతం’ వాణిజ్య పరంగా సక్సెస్ అయినా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కాలేదు. కానీ, ‘భీమా’తో తప్పకుండా హిట్ సాధిస్తామనే నమ్మకం ఉంది. ఈ సినిమాని చాలా
గ్రాండ్‌గా నిర్మించారాయన.
► మా నాన్న (డైరెక్టర్ టి. కృష్ణ)తో పాటు ఆ తరంలోని దర్శకులు జనాలతో మమేకం అయ్యేవారు. అలా ప్రజల సాధక బాధకాలు, సమస్యలు తెలుసుకుని కథ రాసుకుని, సామాజిక బాధ్యతతో సినిమాలు తీసి హిట్ సాధించేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. శంకర్‌గారి లాంటి ఒకరిద్దరు దర్శకులు తప్ప మిగిలిన వారు సమాజం, ప్రజల నేపథ్యంలో కథలు రాయడం లేదు. సొసైటీ బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకుని సరైన విధానంలో తెరపై చూపించగలిగితే ఇప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తారు. దర్శకత్వం అనేది చాలా కష్టమైన పని.. అందుకే నాకు ఆ ఆలోచన లేదు.
► చిత్ర పరిశ్రమలో దాదాపు 22 ఏళ్ల ప్రయాణం నాది.. ఇన్నేళ్ల జర్నీ హ్యాపీగా ఉంది కానీ నటుడిగా పూర్తిగా సంతృప్తి పడటం లేదు. ఒక నటుడికి సంతృప్తి అనేది ఎప్పటికీ ఉండదు.. ఎప్పటికప్పుడు కొత్తగా చేయాలనే తపన ఉంటుంది. ప్రభాస్, నేను కలిసి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కానీ, ఆ చాన్స్ రాలేదు.. వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాం. ప్రస్తుతం శ్రీను వైట్లగారి దర్శకత్వంలో నేను చేస్తున్న సినిమా 30 శాతం పూర్తయింది. ఆ తర్వాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్, బాపినీడుగార్లతో ఓ చిత్రం, యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment