సిల్క్ స్మిత పేరు ఇప్పటి సినీ ప్రేక్షకులను తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో తెలుగు సినీ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే పేరు. ఆ రోజుల్లో తన అందంతో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఆమె చేసిన సాంగ్స్ ఇప్పటికీ కూడా మరిచిపోలేరంటే ఎంతలా పేరు సంపాదించిందో అర్థమవుతోంది. సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయ లక్ష్మి. సిల్క్ స్మిత తమిళ చిత్ర పరిశ్రమలో తన నటన జీవితాన్ని ప్రారంభించింది.
నిజం చెప్పాలంటే.. సిల్క్ స్మిత జీవితం ముళ్ల పాన్పు లాంటిది. అందరూ తెరపై ఆమె అందాన్ని చూశారే కానీ.. దాని వెనుక ఉన్న కష్టాన్ని ఎవరు గుర్తించలేకపోయారు. ఎంతోమంది అభిమానుల గుండెల్లో ఆమె శృంగార తారగానే ముద్రపడిపోయింది. తాజాగా ఆమె ఫోటోను నాని నటించిన దసరా మూవీలో ప్రదర్శించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆమెకు వీరాభిమాని కావడం వల్లే ఆమె పోస్టర్‌ను సినిమాలో చూపించారు.
తక్కువ కాలంలోనే ఎన్నో ఆవమానాలు ఎదుర్కొన్న సిల్క్ స్మిత తొందరగానే స్టార్ డమ్ తెచ్చుకుంది. అదే సమయంలో తెరమీద ఆమె అందాలను చూసిన వారే.. బయట చాలా చులకనగా చూసేవారట. వాటితో పాటు మన అనుకున్న వారే ఆస్తి కోసం మోసం చేశాడని తెలియడంతో తాను మరింత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో వాటిని భరించలేక 1996లో బలవన్మరణానికి పాల్పడింది. అప్పట్లో సిల్క్ స్మిత మరణం ఇండస్ట్రీలో ఎంతోమందిని కలిచివేసింది.
అంతే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్కరు కూడా భౌతికకాయాన్ని చూడడానికి కూడా రాలేదట. కనీసం ఆమె కుటుంబ సభ్యులు కూడా రాలేదు. ఒక అనాథలా ఆమెకు అంత్యక్రియలు జరిపించారు. కానీ సిల్క్ స్మిత భౌతికకాయాన్ని చూడడానికి ఒకే ఒక్క హీరో వచ్చాడట. అతనే యాక్షన్ కింగ్ అర్జున్. ఎవరేమనుకున్నా తనకు నష్టం లేదని.. ఆమె కడచూపు కోసం వచ్చాడట అర్జున్. అందుకు ప్రధాన కారణం సిల్క్, అర్జున్ మంచి స్నేహితులుగా ఉండేవారట. సిల్క్ స్మిత ఎప్పుడు అర్జున్ తో నేను చనిపోయాక నన్ను చూడడానికి వస్తావా అని అడిగేదని చెప్పారు. తాజాగా ఈ విషయాన్ని కోలీవుడ్‌కు చెందిన సినీ జర్నలిస్టు తోట భావనారాయణ రివీల్ చేసినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరలవుతోంది.
కాగా.. సిల్క్ స్మిత చివరిసారిగా తిరుంబి పార్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె నాలుగు సినిమాలు మరణానంతరం 2002లో విడుదలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment