‘‘హీరో క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ విలన్ రోల్స్‌కు హద్దులు ఉండవు. విలన్ రోల్స్‌ను ఎంజాయ్ చేస్తూ చేయవచ్చు. హీరోగా చేస్తున్నప్పుడు మార్కెట్, ప్రమోషన్స్, మూవీ అవుట్‌పుట్ ఇలా కాస్త ఒత్తిడిగా ఉంటుంది. అయితే సినిమా హిట్ అయినప్పుడు హీరో పడిన కష్టానికి మంచి ఫలితం వస్తుంది’’ అని అన్నారు కార్తికేయ. అజిత్ హీరోగా కార్తికేయ విలన్ పాత్రలో నటించిన చిత్రం ‘వలిమై’. బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో కార్తికేయ చెప్పిన విశేషాలు.
► ‘వలిమై’ చిత్రదర్శకుడు హెచ్. వినోద్‌గారు కథ వినిపించి, నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని చెప్పారు. అప్పటికే ఆయన దర్శకత్వంలో కార్తీ హీరోగా చేసిన ‘ఖాకీ’ సినిమా చూశాను. పైగా ‘వలిమై’లో అజిత్‌గారు హీరో అనగానే హ్యాపీ ఫీలయ్యాను. అంత పెద్ద స్టార్‌తో నటిస్తే కెరీర్ పరంగా నాకు ఫ్లస్ అవుతుందని భావించి ‘వలిమై’ ఒప్పుకున్నాను.
► ఈ సినిమాలో నేను చేసిన నెగటివ్ క్యారెక్టర్‌కి డిఫరెంట్ షేడ్స్ అండ్ లేయర్స్ ఉన్నాయి. పెర్ఫార్మెన్స్‌కు మంచి స్కోప్ ఉంది. ఈ సినిమా కోసం నేను తమిళం నేర్చుకున్నాను. భాషపై అవగాహన ఉన్నప్పుడే యాక్టర్‌గా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలమని నమ్ముతాను.
► అజిత్‌గారు ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో గాయపడినా లొకేషన్‌ను విడిచి వెళ్లలేదు. యూనిట్ ఇబ్బంది పడకూడదని భావించి గాయంతోనే షూటింగ్‌లో పాల్గొన్నారు. అంత పెద్ద స్టారే అలా చేస్తున్నప్పుడు మనం ఇంకెంతో కష్టపడాలి అనిపించింది.
► ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌లో ప్రశాంత్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను. శ్రీదేవి మూవీస్‌లో ఓ సినిమా చేస్తున్నాను. ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్‌లో మూవీ కమిటయ్యాను. దర్శకుడు అజయ్ భూపతితో మళ్లీ సినిమా ఉంటుంది. అయితే ఇది ‘ఆర్‌ఎక్స్100’కు సీక్వెల్ కాదు.. లవ్‌స్టోరీ. ఇక సుకుమార్ రైటింగ్స్‌లో నేను చేయాల్సిన సినిమా సందిగ్ధంలో ఉంది. ప్రస్తుతం సుకుమార్‌గారు ‘పుష్ప: ది రైజ్’తో బిజీగా ఉన్నారు.
► నేను నటించిన కొన్ని సినిమాలు సరైన ఫలితం ఇవ్వలేదు. కానీ ఓ యాక్టర్‌గా నా ప్రయత్న లోపం మాత్రం లేదు. అలాగే ఫ్లాప్ అయిన సినిమా నుంచి నా తప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దుకున్నాను. చేసిన తప్పు మళ్లీ చేయకూడదని నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను.
Comments
Please login to add a commentAdd a comment