బిపాషా బసు.. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న ‘తెల్లరంగు’ అబ్సేషన్‌ను అవతలికి నెట్టిన నటి. డినో మోరియా... మోడల్స్ ర్యాంప్ మీదే కాదు తెర మీదా మెప్పించగలరని చూపించిన నటుడు. కలిసి ఉన్నా లేకపోయినా స్నేహితులుగా ఒకరినొకరు గౌరవించుకోవాలి.. ఒకరికోసం ఒకరు నిలబడాలని నిరూపించిన జత ఇది. ప్రేమను విఫలం చేసుకున్న వ్యక్తులుగా చిత్రీకరించే కంటే మైత్రిని కాపాడుకున్న జంటగా వీళ్లను వర్ణించడం సబబు.
బిపాషా ఫ్రమ్ కోల్‌కతా, డినో ఫ్రమ్ బెంగళూరు.. దాదాపు ఇద్దరూ ఒకేసారి ముంబై చేరారు మోడలింగ్ కోసం. కెరీర్ మొదటి నుంచీ ఈ ఇద్దరు మంచి స్నేహితులు. బాధనూ, సంతోషాన్నీ కలిసే పంచుకున్నారు. అరకొర అవకాశాలతో ఆర్థిక ఇబ్బందులు పడ్తున్నప్పుడు డబ్బు ఆదా చేయడం కోసం.. ముంబైలోని ‘జై హింద్ ’ హోటల్‌లో పది రూపాయలకే దొరికే తాలీనీ కలిసే తిన్నారు. ‘పది రూపాయల ఆ తాలీలో అన్నం నేను తింటే చపాతీలు డినో తినేవాడు. ఒక్కోసారి సంగం అన్నం, సగం రొట్టెలను పంచుకునే వాళ్లం. ఇలా ఒకటి, రెండు రోజులు కాదు కొన్ని నెలలు గడిపాం’ అంటుంది బిపాషా. కష్టసుఖాల్లో జంటగా చేసిన ఆ ప్రయాణమే వాళ్లిద్దరినీ ప్రేమికులుగా మార్చింది. 1997నాటి ఈ ముచ్చట అప్పటి పేజ్ త్రీకే కళను తెచ్చింది. ఏ పత్రికలోని ప్రేజ్ త్రీని తిరగేసినా... ఈ జంట ఫొటోలు.. ఆ ప్రేమ కబుర్లే. మోడలింగ్ ఫీల్డ్ ఈ ఇద్దరినీ ‘క్రేజీ కపుల్’గా పిలుచుకుంది.
రాజ్...
మోడలింగ్‌లో వస్తున్న పేరు, ప్రతిష్ఠలను ఆస్వాదిస్తూ బిపాషా ఆనందంగానే ఉంది. అంతకుమించి ఆశలు, లక్ష్యాలు ఏమీ పెట్టుకోదల్చుకోలేదు ఆమె. కానీ డినోనే అక్కడితో ఆగిపోవాలనుకోలేదు. అతని విషయంలోనే కాదు బిపాషా విషయంలోనూ. ‘నీ టాలెంట్‌ను మోడలింగ్‌కే పరిమితం చేయకు. సిల్వర్ స్క్రీన్ మీదా కనిపించాలి నువ్వు. సినిమాల్లో చాన్స్‌ల కోసం ప్రయత్నించు. నేనూ ఆ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుంటన్నా’ అంటూ బిపాషాను ప్రోత్సహించాడు. అనుకున్నట్టుగానే ఆ ప్రయాణమూ కలిసే మొదలుపెట్టారు. అయితే బిపాషా తొలి సినిమా ‘అజ్‌నబీ’తోనే స్టార్‌డమ్ తెచ్చేసుకుంది. కాని డినో మోరియా స్ట్రగుల్ కొనసాగింది. ఇండస్ట్రీ తీరు తెన్నులను ఔపోసన పట్టి తగ్గట్టుగానే తనను తాను మలచుకుంది బిపాషా.
వెండితెర వెలుగులో తన ప్రియ సఖి వెలిగిపోవడం డినోకు ఆనందాన్నిచ్చినా.. ఎందుకో తామిద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టు అతని మనసు గ్రహించింది. ఈ లోపే ఈ ఇద్దరూ కలిసి నటించే ఆపర్చునిటీ వచ్చింది. అదే ‘రాజ్’ మూవీ. సూపర్ హిట్ అయింది. సిల్వర్‌స్క్రీన్ మీదా వీళ్ల కెమిస్ట్రీకి తిరుగులేదని తేలింది. ‘రాజ్’తో బిపాషా ఇటు దర్శక, నిర్మాతలకే కాదు అటు హీరోలకు, అశేష ప్రేక్షక జనానికీ అభిమాన తార అయిపోయింది. కాల్షీట్లు సర్దుబాటు చేసుకోలేనంత బిజీగా మారిపోయింది.
అదే సినిమా డినోకూ అంతే పేరు సంపాదించి పెట్టినా అతను ఊహించినన్ని అవకాశాలను షెడ్యూల్ చేయలేకపోయింది. ఆ కారణం వలనో.. బిపాషా కూడా కెరీరే ముఖ్యంగా ప్రవర్తించడం వలనో ఏమో కాని.. ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. వాళ్లు నిలబడ్డ ప్రేమ తీరంలోని ఇసుక జారిపోవడం మొదలైంది. ఇది 2002 నాటి సంగతి. ఏడేళ్ల వాళ్ల అనురాగం తెలియకుండానే కరిగిపోయింది.
బ్రేకప్‌తో ఎండ్ అయిపోంది.
... అయినా ఆ ఇద్దరూ గొడవపడలేదు. ఆమె సక్సెస్‌ను చూసి అతను ఈర్ష్యపడలేదు. టాప్ హీరోల్లో ఒకడిగా లేనందుకు అతణ్ణి ఆమె చులకన చేయలేదు. ఆత్మీయుడిగానే భావించింది. అతనూ అంతే. ఇద్దరిలో ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు స్వాంతనగా నిలుస్తారు. ఒకరి అభిప్రాయాలను, నిర్ణయాలను మరొకరు గౌరవించుకుంటూ మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు ఇప్పటికీ.
‘మా ఇద్దరి ప్రేమ గతం.. ఫ్రెండ్‌షిప్ వర్తమానం. గతాన్ని తలచుకుంటూ వర్తమానాన్ని సమస్యాత్మకంగా మలచుకోవడం మా ఇద్దరి నైజం కాదు. యవ్వనంలో జరిగిన అద్భుతం మా ప్రేమ. పరిణతి చేర్చిన గమ్యం ఇప్పటి మా స్నేహం. బిపాషా.. గ్రేట్ హ్యుమన్ బీయింగ్. తను నన్నెప్పుడూ అత్యంత ఆప్తుల్లో ఒకడిగానే చూస్తుంది. నాకూ తను అంతే’ అంటాడు డినో మోరియా.
- ఎస్సార్
Comments
Please login to add a commentAdd a comment