బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసుకు పెద్ద కష్టం వచ్చింది. గతేడాది నవంబర్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె తన పాపయికి దేవి అని నామకరణం చేసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన గారాలపట్టికి పుట్టుకతోనే గుండెలో రంధ్రాలతో జన్మించిందని వెల్లడించింది హీరోయిన్. దీంతో మూడు నెలల వయసులోనే తనకు సర్జరీ చేశారంటూ కంటతడి పెట్టుకుంది. శనివారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చిన బిపాషా తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి, తల్లిగా తను ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైంది.
ఈ నరకం ఎవరికీ రాకూడదు
'దేవి పుట్టిన మూడు రోజులకు తన గుండెలో రెండు రంధ్రాలు ఉన్నాయని తెలిసింది. వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్(వీఎస్‌డీ) ఉంది, దాన్ని సరి చేయాలంటే సర్జరీ చేయాలన్నారు. అసలు వీఎస్‌డీ అంటే ఏంటో కూడా తెలియదు. చాలా బాధపడ్డాం. ఈ బాధనంతా పంటికింద అదిమిపెట్టి నవ్వుతూ కనిపించాం. ఇటువంటి నరకం ఏ తల్లికీ రాకూడదు. కనీసం ఈ విషయాన్ని మేము మా కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదు. తన రాకను ఎంతో ఘనంగా వేడుక చేసుకోవాలనుకున్నాం. కానీ ఈ విషయం తెలిసి మా మనసు ముక్కలైంది. మొదటి ఐదు నెలలు మాకు చాలా కష్టంగా కొనసాగాయి.
ఈ గండం నుంచి గట్టెక్కాలనుకున్నా
అయితే దేవి మాత్రం మొదటిరోజు నుంచే ఎంతో హుషారుగా కనిపించేది. తనకు మూడు నెలల వయసున్నప్పుడు స్కానింగ్‌కు తీసుకెళ్లాం. అంత చిన్న పసిపాపకు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే చెప్పలేనంత బాధేసింది. కరణ్(బిపాషా భర్త) సిద్ధంగా లేడు, కానీ నేను మాత్రం తను వీలైనంత త్వరగా ఈ గండం నుంచి గట్టెక్కాలనుకున్నాను. ఆరు గంటలపాటు ఆపరేషన్ జరిగింది. అప్పుడు నా జీవితమే ఆగిపోయినట్లనిపించింది. చివరకు ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఊపిరి పీల్చుకున్నాం' అంటూ కంటతడి పెట్టుకుంది బిపాషా బసు.
కరణ్‌తో పెళ్లి
కాగా తెలుగులో టక్కరి దొంగ సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న బిపాషా హిందీలో రాజ్, జిస్మ్ వంటి చిత్రాలతో టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది. 2015లో వచ్చిన 'ఎలోన్' సినిమాలో కరణ్ సింగ్ గ్రోవర్‌తో కలిసి నటించింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ఇష్క్ మొదలైంది. ఆ తర్వాత థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'డేంజరస్'లోనూ వీరు కలిసి నటించారు. కొంతకాలంపాటు డేటింగ్ చేసిన వీరిద్దరు 2016లో పెళ్లిపీటలెక్కారు. వీరికి గతేడాది నవంబర్ 12న పాప జన్మించింది. తె పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె 2018లో వచ్చిన వెల్‌కమ్ టు న్యూయార్క్ సినిమాలో మాత్రం అతిథి పాత్రలో మెరిసింది.
చదవండి: సర్కారు నౌకరి.. టీజర్ చూశారా?
Comments
Please login to add a commentAdd a comment