
ఈ ఏడాది మలయాళంలో విజయం సాధించిన చిత్రాలలో ‘అంజామ్ పాతిరా’ ఒకటి. కుంచక్కో బోబన్, షరాఫ్ ఉద్దీన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. మిధు మాన్యూల్ థామస్ దర్శకత్వం వహించారు. పోలీస్ ఆఫీసర్లను వరుసగా హత్య చేసే సీరియల్ కిల్లర్‌ను ఎలా ఎదుర్కొన్నారు? ఎలా ఆపారు? అనేది చిత్రకథ. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతోంది రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ.
మలయాళ చిత్రాన్ని నిర్మించిన ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్‌తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది రిలయన్స్. ‘‘ప్రేక్షకుడిని ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసే కథాంశం ఉన్న చిత్రమిది. ఇలాంటి సినిమాను దేశవ్యాప్తంగా ఆడియన్స్‌కు అందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు రిలయన్స్ ప్రతినిధి సిభాషిస్ సర్కార్. ఈ రీమేక్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారు? ఎవరు నటిస్తారు? అనే వివరాలను ప్రకటించలేదు.