ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘లైన్ ఆఫ్ డ్యూటీ’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
ఇప్పుడు అందరూ దాదాపు తలదించుకునే ఉంటున్నారు... ఎందుకంటే సెల్‌ఫోన్ చూడ్డానికి. ఆప్తుల కన్నా, కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ అయిపోయింది సెల్‌ఫోన్. ఈ సెల్‌ఫోన్ ఓ అగ్గి అయితే, సోషల్ మీడియా దానికి తోడవుతున్న గాలి. అగ్నికి ఆజ్యమన్నట్టు ఈ సోషల్ మీడియా ముఖ్యంగా నేటి యువతను పూర్తిగా వశపరుచుకుంటోంది. సోషల్ మీడియా చెడు అన్న అంశం ఎంత నిజమో మంచి అన్నదానికి నిదర్శనమే ఈ ‘లైన్ ఆఫ్ డ్యూటీ’ సినిమా.
దర్శకులు స్టూవెన్ సి. మిల్లర్ రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ప్రముఖ నటుడు ఆరన్ యఖార్ట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ‘లైన్ ఆఫ్ డ్యూటీ’ కథాంశానికొస్తే... ఫ్రాంక్ పెన్నీ ఓ నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్. కానీ అతని కెరీర్‌లో మాయని మచ్చ ఓ షూటవుట్‌లో అనుకోకుండా ఓ చిన్నపిల్లవాడిని తన చేతులతో కాల్చి చంపడం. దాని గురించి బాధ పడుతున్న తరుణంలోనే ఓ కిడ్నాపర్ తన సహోద్యోగి కుమార్తెను కిడ్నాప్ చేసి, పోలీసులకు సవాలు విసురుతాడు.
ఈ తరుణంలో అవా బ్రూక్స్ అనే యంగ్ సోషల్ మీడియా రిపోర్టర్ ఫ్రాంక్ పెన్నీకి తారసపడుతుంది. సమాజంలో జరిగే వాస్తవ దారుణాలను అవా బ్రూక్స్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంటుంది. ఫ్రాంక్ పెన్నీతో కలిసి అవా బ్రూక్స్ సోషల్ మీడియా ద్వారా ఈ కిడ్నాపింగ్ ఆపరేషన్ ఎలా చేసింది? అన్నది లయన్స్ గేట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ‘లైన్ ఆఫ్ డ్యూటీ’లోనే చూడాలి. ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా సోషల్ మీడియా విలువలను నేటి యువతరానికి అర్ధమయ్యేలా చెబుతుంది. వర్త్ టు వాచ్ ది ‘లైన్ ఆఫ్ డ్యూటీ’.
– ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment