ప్రేక్షకులు సినిమాని చూస్తారు. కాని అదే దర్శకుడు సినిమాని సృష్టిస్తాడు. ఇక్కడ దర్శకుడు తన సృష్టి తో పాటు ఆ సినిమాని మానసికంగా అనుభూతి పొందుతాడు. దానికి నిలువెత్తు నిదర్శనం ఈ అమెరికన్ థ్రిల్లర్ డోన్ట్ మూవ్. ఆడమ్ బ్రియో తో కలిసి రూపొందించిన ఈ సినిమా కాన్సెప్ట్ మిమ్మల్ని కన్నార్పనివ్వదు. డేవిడ్ వైట్ అందించిన కథకు వీరిరువురు ప్రాణం పోయగా, లీడ్ రోల్ లో ఐరిస్ పాత్రలో నటించిన కెల్సీ ఈ చిత్రానికి ఊపిరూదింది. సినిమా మొత్తం మనకు కెల్సీ కనిపించదు. ఐరిస్ మాత్రమే మన కళ్ళముందు కదలాడుతుంది. ఈ సినిమా లో పెద్ద కథాంశం లేదు కాని తీసుకున్న కాన్సెప్ట్ మాత్రం అదరహో అని చెప్పవచ్చు.
ఐరిస్ హైకింగ్ లో తన కొడుకును పోగొట్టుకున్న బాధతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడి నుండే సినిమా ప్రారంభమవుతుంది. అప్పుడే అక్కడ తనని తాను రిచర్డ్ అని పరిచయం చేసుకున్న వ్యక్తి ఐరిస్ మీద ఓ ఇంజెక్షన్ తో దాడి చేస్తాడు. ఆ ఇంజెక్షన్ వల్ల 20 నిమిషాలలో శరీరంలోని ఒక్కో అవయవం పని చేయకుండా పోతుందని రిచర్డ్ చెప్పి ఐరిస్ ని బందీగా చేసుకుని తనతో పాటు కారు లో తీసుకువెళుతుంటాడు.
ఇంజెక్షన్ వల్ల ఒక్క కళ్ళు తప్ప ఎటూ కదలలేని ఐరిస్ రిచర్డ్ బారి నుండి తప్పించుకోలిగిందా లేదా అన్నది మాత్రం డోన్ట్ మూవ్ సినిమాలోనే చూడాలి. ఒక్కసారి ఆలోచించండి మన శరీరంలో ఏ కాలో, చెయ్యో ఇబ్బంది కలిగితేనే తట్టుకోలేము అలాంటిది దాదాపుగా అన్ని అవయవాలు పని చేయడం మానేసి ఓ నరరూప రాక్షసుడి చేతిలో బందీ అవడం అంటే అంతకన్నా దారుణం ఏముంటుంది. పైన చెప్పినట్టు దర్శకులు ఈ సినిమాని ఎలా సృష్టించారో అర్ధమవదు కాని వారి ఆలోచనా పటిమకు మాత్రం ప్రేక్షకులుగా మనం హాట్సాఫ్ చెప్పి తీరాలి. ఈ సినిమా మనం చూస్తున్నంతసేపు కదలలేము, వదలలేము ఎందుకంటే ఈ సినిమా పేరు డోన్ట్ మూవ్ కాబట్టి. ఎ మస్ట్ వాచ్ థ్రిల్లర్.
-ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment