టైటిల్: హనీమూన్ ఎక్స్‌ప్రెస్
నటీనటులు: చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు
నిర్మాతలు: కేకేఆర్, బాలరాజ్
రచన, దర్శకత్వం : బాల రాజశేఖరుని
సంగీతం: కళ్యాణి మాలిక్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ఆర్ పి పట్నాయక్
ఎడిటింగ్ : ఉమా శంకర్ జి (యు ఎస్ ఎ), శ్రీ కృష్ణ అత్తలూరి
విడుదల తేది: జూన్ 21, 2024
కథేంటంటే..
వేరు వేరు మనస్తత్వాలు ఉన్న సోనాలి(హెబ్బా పటేట్), ఈషాన్(చైతన్య రావు) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత తొలి రాత్రి నుంచే వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. ముఖ్యంగా శృంగార జీవితాన్ని వీరిద్దరు ఆస్వాదించలేకపోతారు. కౌన్సిలింగ్ కోసం థెరపిస్ట్‌లను కలుస్తారు. అయినా ప్రయోజనం ఉండడు. ఓ సారి వీరిద్దరు కారులో వెళ్తుంటే.. ఓ వృద్ధ జంట(తనికెళ్ల భరణి, సుహాసిని) పరిచయమై హనీమూన్ ఎక్స్‌ప్రెస్(రిస్టార్ట్) గురించి చెబుతుంది. ఆ రిసార్ట్‌కి వెళ్లిన తర్వాత వీరిద్దరి ఎదురైన అభువాలు ఏంటి? అసలు ఈ వృద్ధ జంట ఎవరు? హనీమూన్ ఎక్స్‌ప్రెస్ కాన్సెప్ట్ ఏంటి? ప్రేమ వివాహం చేసుకున్న సోనాలి, ఈషాన్ శృంగార జీవితం సరిగ్గా ఉండకపోవడానికి గల కారణం ఏంటి? రిసార్ట్‌లోకి వెళ్లిన తర్వాత వీరిలో వచ్చిన మార్పు ఏంటి? చివరకు వీరిద్దరు విడిపోయారా? ఒక్కటయ్యరా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ప్రస్తుతం విడాకులు అనేది చాలా సింపుల్ మ్యాటర్ అయిపోయింది.చిన్న చిన్న విషయాల్లో గొడవపడి విడిపోతున్నారు. భార్యకు నచ్చినట్లుగా భర్త, భర్తకు నచ్చినట్లుగా భార్య ప్రవర్తించకపోవడంతో గొడవలు మొదలవుతున్నాయి. ఒకరికొకరు సరిగ్గా అర్థం చేసుకుంటే కాపురంలో గొడవలే ఉండవు. ఈ పాయింట్‌తోనే హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌ని తెరకెక్కించాడు దర్శకుడు బాల రాజశేఖరుడు. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ అనుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో పూర్తిగా సఫలం కాలేదు. స్క్రీప్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సింది.
చాలా చోట్ల కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. కథ ప్రారంభం కాస్త ఆసక్తికరంగా ఉన్నా.. ప్రేమ, పెళ్లి, శోభనం ఇదంతా చాలా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. వృద్ధ జంట ఎంట్రీ తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ గేమ్ గురించి వివరించిన తర్వాత ఏదో జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. రిసార్ట్‌లోకి వెళ్లిన అక్కడ వచ్చే ట్విస్ట్ కథపై మరింత ఆసక్తిని పెంచుతుంది. అయితే ఆ ట్విస్ట్ తర్వాత క్లైమాక్స్ ఏంటో ఈజీగా అర్థం అవుతుంది. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు యూత్‌ని ఆకట్టుకున్నా..ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. బడ్జెట్ ప్రాబ్లమో ఇంకేదో కానీ.. చాలా సన్నివేశాలు చుట్టేశారనే ఫీలింగ్ కలుగుతుంది. ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా స్క్రీన్‌ప్లే బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
ఈషాన్ పాత్రకు చైతన్యరావు న్యాయం చేశాడు. డీసెంట్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. హెబ్బా పటేల్ అందాల ప్రదర్శన ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నటన కంటే ఎక్స్‌ఫోజింగ్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. సీనియర్ నటులు తనికెళ్ల భరణి, సుహాసిని డిఫరెంట్ పాత్రల్లో మెరిశారు. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కొంతవరకు ఓవరాక్షన్‌గా అనిపించినా.. నవ్వుకోవచ్చు. అలీ కనిపించేది ఒక సీన్‌లో అయినా..నవ్వించే ప్రయత్నం చేశాడు. అరవింద్ కృష్ణ, సురేఖ వాణి, రవి వర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా ఈ సినిమా జస్ట్ ఒకే. కల్యాణీ మాలిక్ అందించిన పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. నేపథ్యం సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment