‘చమ్కీల అంగీలేసి ఓ వదినే..
చాకు లెక్కుండేటోడే ఓ వదినే..
కండ్లకు ఐనా బెట్టి.. కత్తోలే కన్నెట్ల కొడ్తుండెనే..’
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. అచ్చమైన తెలంగాణలో యాసలో సాగే ఈ పాట నాని హీరోగా నటించిన ‘దసరా’ సినిమాలోనిది. అయితే అందరి దృష్టి ఈ పాటలోని లిరిక్స్, మ్యూజిక్ కంటే.. అది ఆలపించిన ఫీమేల్ సింగర్‌పైనే ఎక్కువ పడింది. ఇటీవల విడుదలైన లిరికల్ వీడియోలో ఆమె తన గొంతుతో పాటు.. హావ భావాలతో అందరికి ఆకర్షించింది. ఇంత చక్కగా ఆలపించిన ఆ ఫీమేల్ సింగర్ ఎవరబ్బా అని నెటిజన్స్ వెతకడం ప్రారంభించారు.
అయితే ఆమె పక్కా తెలుగమ్మాయి అనుకున్నారంతా.. కానీ ఈ పాట పాడింది ఓ తమిళ అమ్మాయి. ఆమె పేరు దీక్షిత అలియాస్ ధీ. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ముద్దుల కూతురే ఈ ధీ. ఆస్ట్రేలియాలో చదువుకున్న ధీ..సంగీతంపై ఉన్న మక్కువతో 14 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చేసింది.
సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన అనేక సినిమాల్లో ధీ పాటలు పాడింది. ముఖ్యంగా తమిళంలో ఆమె ఆలపించిన పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగులో ‘గురు’లోని ‘ఓ సక్కనోడా..’, మారి 2లోని రౌడీ బేబీ, ఆకాశమే హద్దురాలోని కాటుక కనులే’ సాంగ్స్ బాగా ఫేమస్ అయ్యాయి.
అయితే ఇన్నాళ్లు ఆమె ఆలపించిన పాటలు అందరికి తెలుసు కానీ. ధీ గురించి మాత్రం ఎవరికి తెలియదు. కానీ ‘చమ్కీల అంగీలేసి..’పాటతో ధీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఓ రకంగా చెప్పాలంటే ఓవర్‌నైట్ స్టార్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment