
కాజోల్.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఎలాంటి కష్టతరమైన పాత్రలోకి అవలీలగా పరకాయ ప్రవేశం చేసి తన నటనా పటిమను చాటుకున్న బ్యూటీఫుల్ హీరోయిన్ ఆమె. 17 ఏళ్ల వయసులో 1992లో విడుదలైన 'బేఖుడి' చిత్రంతో సినీ రంగానికి పరిచయమైంది బ్యూటీఫుల్ కాజోల్. కుచ్ కుచ్ హోతా హై, దిల్వాలే దుల్హానియే లేజాయింగే, ఫనా, బాజీగర్, దుష్మన్, త్రిభంగ, కరణ్ అర్జున్, మెరుపు కలలు, వీఐపీ 2 వంటి తదిర సినిమాలతో ఎంతో పేరు తెచ్చుకుంది.
కాగా.. 1999లో ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వారిద్దరికి నైసా, యుగ్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అజయ్, కాజోల్ కలిసి నటించిన 'తానాజీ' సినిమా 68వ జాతీయ చలన చిత్ర అవార్డులలో మూడు బహుమతులను గెలుపొందింది. అయితే గతంలో ఓ ఈవెంట్‌లో మాట్లాడిన కాజోల్ వారి ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అజయ్‌ను మొదటిసారి చూసినప్పుడు తనకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదని కాజోల్ తెలిపింది.
కాజోల్ మాట్లాడూతూ..'నేను అతన్ని హల్ చల్ మూవీ సెట్స్‌లో కలిశాను. అది మా షూటింగ్‌లో మొదటి రోజు. నిర్మాత నా దగ్గరకు వచ్చి అక్కడున్న వ్యక్తి హీరో అని చెప్పాడు. అతను ఒక మూలకు కుర్చీలో కూర్చున్నాడు. నేను అతన్ని చూసి 'నిజమా? అతనేనా హీరో? అని ఆశ్చర్యం వ్యక్తం చేశా. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. అజయ్ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడే వ్యక్తి అని గ్రహించా. ఆ తర్వాత మేం ఫ్రెండ్స్ అయ్యాం' అని అన్నారు. కాగా.. వీరిద్దరు నటించిన హల్‌చల్ 1995లో థియేటర్లలో విడుదలైంది.
కాగా.. అజయ్ దేవగన్ ప్రస్తుతం తన తాజా చిత్రం భోలా బాక్సాఫీస్ విజయంతో దూసుకుపోతున్నాడు. లోకేష్ కనగరాజ్ చిత్రం తమిళ హిట్ మూవీని కైతిని హిందీ రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి అజయ్ దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో అజయ్‌తో పాటు టబు, గజరాజ్ రావు, దీపక్ డోబ్రియాల్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment