ఆ చిత్రాలను మళ్లీ ఆరంభించాలని ప్లాన్‌ | Kamal Haasan plans to Restarts Sabaash Naidu and Indian 2 Movies | Sakshi
Sakshi News home page

ఆ చిత్రాలను మళ్లీ ఆరంభించాలని ప్లాన్‌

Published Thu, Jul 21 2022 12:17 AM | Last Updated on Thu, Jul 21 2022 10:55 AM

Kamal Haasan plans to Restarts Sabaash Naidu and Indian 2 Movies - Sakshi

కొబ్బరికాయ కొట్టారు.. వీలైనంత త్వరగా షూటింగ్‌ ముగించాలనుకున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. ఇలా బ్రేక్‌ పడిన చిత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో కమల్‌హాసన్‌ ‘భారతీయుడు 2’, ‘శభాష్‌ నాయుడు’, విక్రమ్‌ ‘ధృవ నక్షత్రం’ ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు పలు అంచనాల నడుమ ఆరంభమయ్యాయి. అయితే చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. ఇప్పుడు ‘రీ స్టార్ట్‌’ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.

‘విక్రమ్‌’ సినిమా సక్సెస్‌ జోష్‌లో ఉన్నారు కమల్‌హాసన్‌. దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంత బంపర్‌ హిట్‌ సాధించారు కాబట్టే కమల్‌ తన తదుపరి చిత్రాల షూటింగ్స్‌ని, ఆగిపోయిన చిత్రాలను మళ్లీ ఆరంభించాలనీ ప్లాన్‌ చేసుకుంటున్నారు. నిజానికి అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ‘విక్రమ్‌’ కంటే ముందు కమల్‌ ‘ఇండియన్‌ 2’ (‘భారతీయుడు 2) రిలీజ్‌ అయ్యుండేది.

కానీ దర్శకుడు శంకర్‌కు, ఈ చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య విభేదాలు, ‘ఇండియన్‌ 2’ సెట్స్‌లో ప్రమాదం జరిగి క్రూ మెంబర్స్‌ చనిపోవడం వంటి కారణాల చేత ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. అయితే కమల్‌  చొరవతో ‘ఇండియన్‌ 2’ సినిమా షూటింగ్‌ మళ్లీ సెట్స్‌పైకి వెళ్లనుందని కోలీవుడ్‌ టాక్‌. ఈ సినిమా షూటింగ్‌ ఆగస్టు చివరివారం లేదా సెప్టెంబరులో ఆరంభం కానుందని తెలిసింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా తొలుత కాజల్‌ అగర్వాల్‌ ఉన్నారు.

కాజల్‌ తల్లి అయిన విషయం తెలిసిందే. మరి.. ఆమె ఈ చిత్రంలో ఉంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక మరో కీలక పాత్రధారి వివేక్‌ చనిపోయారు. ఆయన పాత్రకు నటుణ్ణి ఎంపిక చేసే పనిలో    ఉందట ‘ఇండియన్‌ 2’ టీమ్‌. 1986లో కమల్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన    ‘ఇండియన్‌’కి సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక కమల్‌ చిత్రాల్లో ఆగిన మరో సినిమా ‘శభాష్‌ నాయుడు’.

2016లో ఈ సినిమా ఆరంభమైన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో శ్రుతీహాసన్, బ్రహ్మానందం కీలక పాత్రధారులు. ఈ షూటింగ్‌ జరుగుతున్నప్పుడు కమల్‌ గాయపడ్డారు. దీంతో ఈ సినిమా ఆగింది. ‘భారతీయుడు 2’ని మళ్లీ స్టార్ట్‌ చేయాలనుకుంటున్నట్లే ‘శభాష్‌ నాయుడు’ని పట్టాలెక్కించాలనుకుంటున్నారట కమల్‌. ఈ సినిమా షూటింగ్‌ కూడా ఈ ఏడాదే ఆరంభం కానున్నట్లు తెలిసింది.

మరోవైపు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా   ‘ధృవ నక్షత్రం’ అనే సినిమా నాలుగేళ్ల క్రితం మొదలైంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ వివిధ కారణాల వల్ల నిలిచిపోయింది. ఈ చిత్రానికి గౌతమ్‌ మీనన్‌ కూడా ఓ నిర్మాత. షూటింగ్‌కి బ్రేక్‌ పడటానికి ఆర్థిక ఇబ్బందులు ఓ కారణం అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాను రీ స్టార్ట్‌ చేసే పనిలో ఉన్నారట. ఇక ‘ఇండియన్‌ 2, శభాష్‌ నాయుడు, ధృవ నక్షత్రం’ టీమ్‌ నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement