బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ'. కంగనా రనౌత్ రచన, దర్శకత్వం, నిర్మించిన ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. ఈ సినిమాపై చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా విడుదల విషయంలో ఆమెకు చెందిన నిర్మాణ సంస్థ నుంచి కీలక ప్రకటన వచ్చింది. మరోసారి వాయిదా వేస్తున్నట్లు వారు ప్రకటించారు. తదుపరి అధికారిక తేదీని త్వరలో ప్రకటిస్తామని కంగనా టీమ్ తెలిపింది.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్‌గా తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' చిత్రం ముందుగా జూన్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే కంగనా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఆమె హిమాచల్‌లోని 'మండి' నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రెండు రోజుల క్రితమే సుమారు పది లక్షల మంది అభిమానుల సమక్షంలో ఆమె నామినేషన్ కూడా వేశారు. ఎన్నికల్లో ఆమె బిజీగా ఉన్న కారణంగానే సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు.
ఎమర్జెన్సీ సినిమాను వాయిదా వేస్తూ తనకు సంబంధించిన మణికర్ణిక ప్రొడక్షన్ నుంచి సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. 'క్వీన్ కంగనా రనౌత్ పట్ల ప్రజలు ఎంతో ప్రేమ చూపుతున్నారు. దీంతో మా హృదయాలు నిండిపోయాయి. ప్రస్తుతం ఆమె దేశసేవకే ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఎమర్జెన్సీ సినిమా పనులకు కంగనా దూరంగా ఉన్నారు. దీంతో విడుదల తేదీని వాయిదా వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలో తెలియచేస్తాం. మీ నిరంతర మద్దతుకు ధన్యవాదాలు.' అంటూ ఆమెకు చెందిన ప్రొడక్షన్ నుంచి ప్రకటన విడుదలైంది. త్వరలో ఎమర్జెన్సీ విడుదల కొత్త తేదీని తెలుపుతామని వారు తెలిపారు.
ఓ సందర్భంలో కంగనా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు చెప్పారు. భారీ బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని కంగనా నిర్మిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ సినిమాని ఆమె తెరకెక్కించారు. కంగనా ఇందిరాగాంధీ పాత్రలో నటించగా.. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment