
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్‌కు తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. స్వీయ దర్శకత్వంలో కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా విషయంలో నోటీసులు జారీ అయ్యాయి. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఒక వర్గానికి సంబంధించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయంటూ న్యాయస్థానం నోటీసులు పంపించింది. ఆమెతో పాటు కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఎమర్జెన్సీ చిత్రాన్ని తెరకెక్కించిన మణికర్ణిక ఫిల్మ్స్‌తో పాటు సెన్సార్ బోర్డు, జీ స్టూడియోస్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఎమర్జెన్సీ సినిమాను అడ్డుకుంటున్నారని ఇప్పటికే కంగనా రనౌత్ పలుమార్లు చెప్పుకొచ్చారు. తాజాగా కోర్టు నోటీసులతో సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ సినిమా విషయంలో 24 గంటల్లోపు స్పందించాలని వారందరికీ నోటీసులు జారీ అయ్యాయి. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ సినిమా తెరకెక్కింది. సెప్టెంబరు 6న విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో కంగనా రనౌత్‌కు అడ్డంకులు ఎదురౌతున్నాయి. అయితే, ఈ సినిమా మరోసారి వాయిదా పడనున్నట్టు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment