బాలీవుడ్ టాప్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. సెప్టెంబరు 6న విడుదల కానున్న ఈ సినిమా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అంశాన్ని తెరపై చూపించనున్నారు. అయితే, ఈ సినిమా విడుదలను ఆపేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ)ని శిరోమణి అకాలీదళ్ డిల్లీ(ఎస్‌ఏడీ) పార్టీ కోరింది. ఈ సినిమాతో చరిత్రను తప్పుగా చూపించనున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు పరమజిత్ సింగ్ సర్నా ఒక లేఖ రాశారు. ఇందులోని సీన్స్ మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆయన అన్నారు.
అత్యాచారాలపై కంగనా రనౌత్‌కు చాలా అనుభవం ఉంది: మాజీ ఎంపీ
కంగనా రనౌత్‌పై పంజాబ్ మాజీ ఎంపీ, అకాలీదళ్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గతంలో రైతుల నిరసనల సందర్భంగా లైంగిక దాడులు జరిగాయని బాలీవుడ్ క్వీన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా సిమ్రంజిత్ సింగ్ మాన్ భగ్గుమన్నారు. లైంగిక దాడి ఎలా జరుగుతుందో కంగనా రనౌత్‌ను అడగండి అంటూ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అత్యాచారాలపై ఆమెకు చాలా అనుభవం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ సినిమాను అడ్డుకుంటామని కూడా ఆయన తెలిపారు.
రేప్‌ను సైకిల్ తొక్కడంతో పోల్చడం సిగ్గుచేటు : కంగనా
సినిమా విడుదలకు మందే తనకు రేప్ బెదిరింపులు వస్తున్నాయని, అలాంటి బెదిరింపు వ్యూహాలతో తన గొంతును ఆపలేరని కంగనా రనౌత్ నొక్కి చెప్పారు. ప్రముఖ మీడియా సంస్థతో కంగనా రనౌత్ మాట్లాడుతూ.. 'కొందరు నాపై తుపాకీలు ఎక్కుపెట్టారు. ఒక కళాకారుడి గొంతు అణచివేయాలని చూస్తున్నారు. నేను వారి తుపాకీలకు భయపడను. ఈ దేశం అత్యాచారాలను చిన్నచూపు చూస్తుందేమో అనిపిస్తోంది. ఈరోజు ఈ సీనియర్ రాజకీయ నాయకుడు అత్యాచారానికి గురికావడాన్ని సైకిల్ తొక్కడంతో పోల్చడం ఆశ్చర్యపోనవసరం లేదు. సరదా కోసం మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు అనేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అని ఆమె అన్నారు.
ఎవరు అడ్డుకుంటారో చూస్తా: కంగనా
ఎమర్జెన్సీ సినిమా రిలీజ్‌కు పంజాబ్‌లో తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సినిమాను విడుదలను ఆపేయాలని ఆప్ ప్రభుత్వం కోరుతోంది. ఖలిస్తాన్ మద్దతుదారులు కూడా ఈ సినిమాకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. తమ అభిప్రాయాన్ని లెక్కచేయకుండా సినిమాను విడుదల చేస్తే కంగనాను చంపేస్తామని ఒక వీడియో ద్వారా హెచ్చరికలు కూడా వారు జారీ చేశారు. అయితే బెదిరిపులకు భయపడే ప్రసక్తే లేదంటూ కంగానా చెప్పారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తానని ఎదురుదాడికి దిగారు. అయితే, తన సినిమాపై ఇంత జరుగుతున్నప్పటికీ బాలీవుడ్ నుంచి తనకు మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment