
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య మొదలు మహారాష్ట్ర సీఎంను ప్రశ్నించడం వరకు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానుతూనే ఉన్నారు. కాగా దేశంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీని నోయిడాలో నిర్మించాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను శుక్రవారం ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై కంగనా స్పందిస్తూ చిత్ర పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. "దేశంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అగ్రస్థానంలో ఉందనుకోవడం పొరపాటు. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. అక్కడ ప్యాన్ ఇండియా లెవల్లో, పలు భాషల్లో సినిమాలు తీస్తున్నారు. అలాగే చాలా హిందీ సినిమాలు కూడా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్నాయి." (చదవండి: నిరూపిస్తే ట్విటర్ నుంచి వైదొలుగుతా: కంగనా)
"ఏదైమేనా యోగి ఆదిత్యనాథ్ మంచి నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఒక్కో భాషకు ఒక్కో చిత్ర పరిశ్రమ ఉండటం వల్ల హాలీవుడ్ లాభపడుతోంది. కాబట్టి అన్ని చిత్రపరిశ్రమలు అఖండ భారత్‌లా ఒక్కటై భారతీయ సినీపరిశ్రమగా అవతరించాలి. దీన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలపాలి" అని చెప్పుకొచ్చారు. కాగా కంగనా తెలుగులో ప్రభాస్ సరసన 'ఏక్ నిరంజన్' చిత్రంలో నటించారు. తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చారు. ఇదిలా వుంటే కంగనా మరోసారి బాలీవుడ్‌ను తక్కువ చేసి మాట్లాడినందుకు సెలబ్రిటీలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. (చదవండి: డ్రగ్స్ కేసు: ప్రముఖుల జాబితా సిద్ధం)
Comments
Please login to add a commentAdd a comment