సినిమా రంగంలో చిత్రాలను నిర్మించి నష్టాల పాలైన నిర్మాతలే ఎక్కువగా ఉంటారనేది నిజమని చెప్పవచ్చు. ఇందులో లాభాలు పొందేది తక్కువ మందే. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా తేడా ఉండదు. కానీ, భారీ చిత్రాలతో ఎక్కువ పొగొట్టుకుంటారు. ఈ క్రమంలో నిర్మాతల కష్టాల గురించి ఆలోచించే నటీనటులు చాలా తక్కువ. నటించామా.. పారితోషికం అందిందా అన్నట్లు చాలా మంది తీరు ఉంటుంది. అయితే నటుడు సూర్యలాంటి వారు అందుకు చాలా భిన్నంగా ఉంటారు. సూర్య నిర్మాత కూడా కావడంతో తన నిర్మాతలపై కొంచెం ఎక్కువ అభిమానం చూపిస్తారనే చెప్పాలి.
అందుకు చిన్న ఉదాహరణ ఆయన ఇటీవల నటించిన చిత్రం కంగువనే కారణం. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌రాజా భారీ ఎత్తున నిర్మించారు. కోలీవుడ్‌లో చాలా కాలం తరువాత 3డీ ఫార్మాట్‌లో రూపొందిన చిత్రం ఇది. నటుడు సూర్య ఈ చిత్రంలోని తన పాత్ర కోసం ప్రాణం పోశారనే చెప్పాలి. అయితే చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదనే విమర్శలను మూట కట్టుకుంది. సుమారు వెయ్యేళ్ల క్రితం జరిగే కథను ఈ కాలానికి ముడిపెట్టి రూపొందించడంతో ప్రేక్షకులు అర్థం చేసుకోలేకపోయారేమో. ఏదైమైనా ఈ చిత్రం విషయంలో నటుడు సూర్య ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం.
కంగువ చిత్రం నష్టాన్ని భర్తీ చేయడానికి నటుడు సూర్య నిర్మాత కేఈ జ్ఞానవేల్‌రాజాకు మరో చిత్రం చేయడానికి పచ్చ జెండా ఊపినట్లు టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కంగువ చిత్రం నిర్మాత జ్ఞానవేల్ కోసమైనా బాగా ఆడాలని నటుడు సూర్య ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపైనే చెప్పారన్నది గమనార్హం. ఆయన స్టూడియో గ్రీన్ సంస్థలో మరో చిత్రం చేయడానికి మంచి కథ కోసం చూస్తున్నట్లు తెలిసింది. అయితే దీనికి దర్శకుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తన 44వ చిత్రాన్ని పూర్తి చేసిన సూర్య ప్రస్తుతం ఆర్‌జే.బాలాజీ దర్శకత్వంలో తన 45వ చిత్రాన్ని చేస్తున్నారు. దీని తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రం చేస్తారని సమాచారం. ఇవన్నీ పూర్తి చేసిన తరువాత నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజాకు చిత్రం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్‌డేట్ త్వరలో రానున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment