కపిల్‌ శర్మ గురించి ఈ నిజాలు తెలుసా? | Kapil Sharma Birthday Special Story | Sakshi
Sakshi News home page

కపిల్‌ శర్మ గురించి ఈ నిజాలు తెలుసా?

Published Sun, Apr 4 2021 8:57 AM | Last Updated on Sun, Apr 4 2021 11:43 AM

Kapil Sharma Birthday Special Story - Sakshi

మీరు హాయిగా నవ్వుకోవాలనుకుంటున్నారా? కపిల్‌ శర్మ షో చూడండి. మనసారా నవ్వాలనుకుంటున్నారా? అతడే చిరునామా. పగలబడి? డిటో. తండ్రి చిన్నప్పుడే కేన్సర్‌తో చనిపోయాడు. చదువుకోవడానికి డబ్బులు లేకపోతే టెలిఫోన్‌ బూత్‌లో పని చేశాడు. నవ్వించాలి అనుకుని నవ్వించి తీరాడు. కపిల్‌ శర్మ ఒక నవ్వుల అంబాసిడర్‌. సగటు మనిషి బాధలకుఅతడు కాసేపు పని చేసేదైనా సరే బెస్ట్‌ వ్యాక్సిన్‌.



2005. దేశంలో నవ్వుల విస్ఫోటనం జరిగింది. స్టార్‌ టీవీలో ‘గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌’ మొదలయ్యింది. దాని విజేతగా ‘సునీల్‌ పాల్‌’ పది లక్షలు బహుమతి గెలుచుకున్నాడు. మొదటిసారి దేశంలో ‘నవ్వు’కు ‘నవ్వించేవారికి’ చాలా డిమాండ్‌ వచ్చి పడింది. రోజువారి బతుకులో జనం కాసేపు నవ్వుకోవడానికి అవసరమైన ప్రోగ్రామ్‌ కోసం ఎదురుచూస్తున్నారని ఈ షో హిట్‌ కావడం వల్ల తెలిసింది. ఇవాళ తెలుగు టీవీ చానల్స్‌లో ప్రసారం అవుతున్న కామెడీ షోస్‌కు ఈ ‘గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌’ మూలం. అలాంటి ప్రోగ్రామ్‌ ఆ సమయంలో చాలామందిని ఇన్‌స్పయిర్‌ చేసింది. అమృత్‌సర్‌కు చెందిన కపిల్‌ శర్మను కూడా.



అమృత్‌సర్‌ కుర్రాడు
కపిల్‌ శర్మ అమృత్‌సర్‌లో ఒక హుషారైన కుర్రాడు. తండ్రి పోలీస్‌ కానిస్టేబుల్‌. అయితే కేన్సర్‌ బారిన పడి కుటుంబాన్ని కష్టాల్లో పడేశాడు. ఆ కష్టాన్ని మర్చిపోవడానికి కపిల్‌ నవ్వును ఒక ఔషధంగా తీసుకున్నాడు. ఫ్రెండ్స్‌ను బాగా నవ్వించేవాడు. జీవితంలో నవ్వును వెతుక్కునేవాడు. కపిల్‌ చాలా మంచి గాయకుడు. నాటకాలు వేసేవాడు. కాలేజీలు అతణ్ణి పిలిచి సీట్లు ఇచ్చేవి. మా కాలేజీలో చదివి మా కల్చరల్‌ యాక్టివిటీస్‌లో పాల్గొను అని ఆహ్వానించేవి. కపిల్‌ శర్మ అలా కాలేజీల కోరిక మేరకు కమర్షియల్‌ ఆర్ట్‌ డిగ్రీని, కంప్యూటర్‌ కోర్సును చదివాడు. రెండూ అన్నం పెట్టలేదు. తాను నమ్ముకున్న నవ్వే అన్నం పెట్టింది.


మొదట ఓడి తర్వాత గెలిచి
2005లో ‘గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌’ చూసి 2006లో కపిల్‌ శర్మ ఆడిషన్స్‌కు వెళ్లాడు. అతను రిజెక్ట్‌ అయ్యి అతని ఫ్రెండ్‌ సెలెక్ట్‌ అయ్యాడు. కాని కపిల్‌ శర్మ ఓటమిని అంగీకరించలేదు. 2007లో మళ్లీ ఆడిషన్స్‌ కు వెళ్లాడు. ఈసారి సెలెక్ట్‌ అయ్యాడు. అంతేనా? పోటీదారులను దాటుకుని ఆ సీజన్‌ విజేతగా నిలిచాడు. ‘ఆ సమయంలో వచ్చిన 10 లక్షల డబ్బు నా చెల్లెలి పెళ్లికి ఉపయోగపడింది. లాఫ్టర్‌ చాలెంజ్‌లో గెలిచిన వెంటనే షోస్‌లో పాల్గొని 30 లక్షలు సంపాదించి చెల్లెలు పెళ్లి చేశాను’ అని కపిల్‌ శర్మ చెప్పుకున్నాడు. కపిల్‌ శర్మలో స్పీడ్, ఆర్గనైజ్‌ చేసే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అందుకే ‘కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్‌’ షో ప్రారంభించి పెద్ద హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత ‘ది కపిల్‌ శర్మ షో’ మొదలెట్టి హిట్‌ కొట్టాడు. అతని షో ఉన్న చానెల్‌ టిఆర్‌పిల్లో ముందుండేది. అందుకే చానల్స్‌ అతని కోసం వెంటపడ్డాయి. మరోవైపు ప్రయివేట్‌ షోస్, టూర్స్‌ అతి త్వరలో కపిల్‌ సంపన్నుడు అయిపోయాడు.



‘నా షోలో పాల్గొంటానని మీరు కల్లో అయినా అనుకున్నారా’ అని అమితాబ్‌ వంటి పెద్దలను తన షోలో అడిగి నవ్విస్తాడు కపిల్‌ శర్మ. నిజానికి అమితాబ్‌ లాంటి వాళ్లు ‘నేను నీ షోకు వస్తానని కల్లో అయినా అనుకున్నావా’ అని అడగాలి. కాని కపిల్‌ శర్మ రివర్స్‌. తన షోకు వచ్చిన సెలబ్రిటీలను మధ్యతరగతి సగటు మనషికి ఉండే డౌట్స్‌ అడుగుతాడు కపిల్‌ శర్మ. తన షోకు వచ్చినవారి గురించి పూర్తి హోమ్‌వర్క్‌ చేసి వారి మీద పంచ్‌లు వేస్తాడు కపిల్‌ శర్మ. అందుకే అతను షారూక్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌ వంటి వారికి కూడా చాలా ఇష్టమైన కమెడియన్‌ అయ్యాడు. గతంలో రాజూ శ్రీవాత్సవ్, జానీలీవర్‌ వంటి కామెడీ స్టార్లు షోలు చేశారు. కాని వారికి కపిల్‌ శర్మ అంతటి సక్సెస్‌ రాలేదు.  కపిల్‌లో ఉండే స్పాంటేనిటీ, నవ్వు, వెకిలితనం లేకుండా నవ్వు రాబట్టగలిగే ప్రతిభ అందుకు కారణం.

డిప్రెషన్‌: కపిల్‌ తనకొచ్చిన పేరుకు తానే భయపడిపోయాడు. ఇది అందరు సెలబ్రిటీలకు ఉండే సమస్యే. కాని కపిల్‌ ఎక్కువ భయపడ్డాడు. ఈలోపు తన షో పార్ట్‌నర్‌ సునీల్‌ గ్రోవర్‌ అతనితో విడిపోయాడు. స్క్రిప్ట్స్‌ రాసేవాళ్లు కొందరు వెళ్లిపోయారు. ఈర్ష్యాసూయలు అతని మీద దుష్ప్రచారం చేశాయి. ఆ సమయంలో కపిల్‌ షో మూతపడింది. అతను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. కపిల్‌ శర్మ ఔట్‌ అని చాలామంది అనుకున్నారు. కాని కపిల్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌ జిన్నిని వివాహం చేసుకున్నాక ఆమె సపోర్ట్‌తో ఒకటిన్నర సంవత్సరం తర్వాత తిరిగి షో ప్రారంభించాడు. ఈసారి అతని శ్రద్ధ, ప్రవర్తన చూసి మెల్లగా ప్రేక్షకులు అతనికి పూర్వవైభవం తెచ్చారు. ఇప్పుడు ‘ది కపిల్‌ శర్మ’ షో అత్యంత సక్సెస్‌ఫుల్‌ షోగా నిలిచి ఉంది. మొన్నటి ఏప్రిల్‌ 2తో కపిల్‌ శర్మకు 40 ఏళ్లు వచ్చాయి. ఒక వ్యక్తి నలభై ఏళ్లకు ఎవరి మద్దతు లేకుండా ఇంత స్థాయికి ఎదగడం చాలా స్ఫూర్తినిచ్చే విషయం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement