సౌత్ ఇండియాలో వరుసగా చిత్రాలు చేసేస్తున్నారు నటుడు సూర్య. ఈయన కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం కంగువ. యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ భారీ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ముఖ్య పాత్రను పోషించిన ఇందులో నటి దిశాపటాని నాయకిగా నటించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం 3డీ ఫార్మెట్‌లో 10 భాషల్లో నవంబర్ 14వ తేదీన తెరపైకి రానుంది.
కంగువ ఆడియో ఆవిష్కరణ వేడుకను త్వరలో చైన్నెలో భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా తాజాగా నటుడు సూర్య తన 44వ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇందులో నటి పూజాహెగ్డే నాయకిగా నటిస్తున్నారు. 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్, స్టోన్ బెంచ్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
దీంతో నటుడు సూర్య తన 45వ చిత్రానికి రెడీ అయిపోతున్నారు. దీన్ని నటుడు ఆర్‌జే. బాలాజీ దర్శకత్వం వహించనున్నారు. డ్రీమ్ వారియర్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుందని సమాచారం. ఇకపోతే ఇందులో నటించే జాక్‌పాట్‌ను వర్ధమాన నటి కాశ్మీరా పరదేశీ కొట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజం అయితే ఆమెకిది నిజంగా లక్కీఛాన్సే అవుతుంది. ఇంతకు ముందు కోలీవుడ్‌లో శివప్పు మంజల్ పచ్చై, పీటీసార్ వంటి చిత్రాల్లో నటించారన్నది గమనార్హం.
అయితే అంతకు ముందే ఈ మరాఠీ బ్యూటీ తెలుగులో నర్తనశాల,వినరో భాగ్యము విష్ణుకథ చిత్రంలోనూ మెరిసింది. హిందీలో మిషన్ మంగళ్ చిత్రంలోనూ నటించింది. కాగా సూర్యతో చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా ఈ క్రేజీ చిత్రానికి హింట్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment