‘మిస్‌’ అయింది! | Keerthi Suresh is Miss India Movie Review | Sakshi
Sakshi News home page

‘మిస్‌’ అయింది!

Published Thu, Nov 5 2020 12:15 AM | Last Updated on Thu, Nov 5 2020 6:13 AM

Keerthi Suresh is Miss India Movie Review - Sakshi

చిత్రం: ‘మిస్‌ ఇండియా’; తారాగణం: కీర్తీసురేశ్, జగపతిబాబు, నవీన్‌ చంద్ర, రాజేంద్రప్రసాద్, నరేశ్, నదియా, కమల్‌ కామరాజు; కెమేరా: సుజిత్‌ వాసుదేవ్‌; ఎడిటింగ్‌: తమ్మిరాజు; సంగీతం: తమన్‌; నిర్మాత: మహేశ్‌ కోనేరు; దర్శకత్వం: నరేంద్రనాథ్‌; రిలీజ్‌ తేదీ: నవంబర్‌ 4; ఓ.టి.టి. వేదిక: నెట్‌ ఫ్లిక్స్‌.

లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు ఎప్పుడూ కత్తి మీద సామే. జనానికి నచ్చితే బ్రహ్మరథం పడతారు. లేదంటే, ఇంతే సంగతులు. ఈ సంగతి తెలిసీ, హీరోయిన్‌ కీర్తీ సురేశ్, దర్శక, నిర్మాతలు చేసిన సాహసం – ‘మిస్‌ ఇండియా’. ఆడవాళ్ళు ఆఖరికి వ్యాపార రంగంతో సహా దేనిలోనూ మగవాళ్ళకు తీసిపోరనే విషయాన్ని నిరూపించడానికి, అమెరికా నేపథ్యంలో, ఇండియన్‌ టీ తయారీ కథతో వండిన వెండితెర వంటకం ఇది.

కథేమిటంటే...
విశాఖ దగ్గరి లంబసింగి గ్రామంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో ముగ్గురు తోబుట్టువుల్లో ఒకరిగా పుట్టిన అమ్మాయి మానసా సంయుక్త (కీర్తీ సురేశ్‌). ‘‘అమ్మాయి బిజినెస్‌ చేయడమనేది మాటల్లోనే కాదు... మనసులో నుంచి కూడా తీసేయ’’మనే అన్నయ్య (కమల్‌ కామరాజు), తల్లితండ్రుల (నరేశ్, నదియా) మధ్య పెరుగుతుంది హీరోయిన్‌. అయితే, సకల రోగ నివారిణిగా రకరకాల మూలికలతో టీ ఇచ్చే ఆయుర్వేద వైద్యుడైన తాతయ్య విశ్వనాథ శాస్త్రి (రాజేంద్రప్రసాద్‌) నుంచి ఆ విద్య నేర్చుకుంటుంది. ఎం.బి.ఎ చదివాక, వ్యాపారవేత్తగా మారి, తాత పేరు నిలబెట్టాలనుకుంటుంది. అనుకోకుండా ఆ కుటుంబం అమెరికాకు మారాల్సి వస్తుంది. అక్కడ జరిగే రకరకాల సంఘటనల మధ్య హీరోయిన్‌ కుటుంబం నుంచి బయటకు వస్తుంది. అక్కడికి సినిమా సగం అవుతుంది.

‘మిస్‌ ఇండియా’ అనే బ్రాండ్‌ ఇండియన్‌ టీ తయారీతో వ్యాపారంలో తన జెండా ఎగరేయాలని హీరోయిన్‌ ఆలోచన.  కానీ, అక్కడి బడా బిజినెస్‌ మ్యాన్, ప్రసిద్ధ కాఫీ తయారీ సంస్థ యజమాని కైలాశ్‌ శివకుమార్‌ (జగపతిబాబు)తో ఆమెకు ప్రతిఘటన ఎదురవుతుంది. ‘‘ఆ కాఫీ కన్నా పదిరెట్లు బాగుండే టీ’’  చేసే హీరోయిన్‌కూ, ‘‘బిజినెస్‌ ఈజ్‌ ఎ వార్‌’’ అని భావించే ఆ విలన్‌కూ మధ్య పోరాటంలో హీరోయిన్‌ ఎలా తుది విజయం సాధించిందనేది చాలా ఓపికగా చూడాల్సిన మిగతా సినిమాటిక్‌ స్టోరీ.

ఎలా చేశారంటే...  
‘మహానటి’ తరువాత కీర్తీ సురేశ్‌ ఒప్పుకున్న ఫస్ట్‌ డైరెక్ట్‌ తెలుగు సినిమా ‘మిస్‌ ఇండియా’. ఈ సినిమాకు ప్రధాన బలం కూడా ఆమే. ఈ కథ, ఇందులోని పాత్ర కోసం ఆమె కాస్తంత అతిగానే సన్నబడ్డారు. ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు శతవిధాల ప్రయత్నించారు. జగపతిబాబు స్టైలిష్‌గా విలన్‌ పాత్రలో బాగున్నారు. కానీ, చిత్ర రూపకర్తలు ఈ కీలక పాత్రల స్వరూపాల మీద పెట్టినంత శ్రద్ధ వాటి స్వభావ చిత్రణ, వివిధ పరిస్థితుల్లో వాటి ప్రవర్తన మీద పెట్టినట్టు లేరు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కావడం, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు కావడం లాంటివి సినిమాటిక్‌గా జరిగిపోతుంటాయి.

ఎలా తీశారంటే...  
ఈ సినిమాకు మరో ప్రధాన బలం కొన్నిసార్లు సీన్‌నూ, పాత్రలనూ కూడా కమ్మేసిన డైలాగు మెరుపులు (రచన – నరేంద్రనాథ్, తరుణ్‌ కుమార్‌). ‘‘గొప్పతనం అనేది ఒక లక్షణం. అది ఒకరు గుర్తించడం వల్ల రాదు. ఒకరు గుర్తించకపోవడం వల్ల పోదు’’, ‘‘జీవితంలో మనం చేసే ఏ పనిలోనైనా ఎంత కష్టపడ్డామన్నది ముఖ్యం కాదు. ఎంత ఆనందంగా ఉన్నామన్నది ముఖ్యం’’, ‘‘డబ్బు ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ, నచ్చినపని అనుభూతిని ఇస్తుంది’’, ‘‘ఇఫ్‌ యు ఓన్ట్‌ బిల్డ్‌ యువర్‌ డ్రీమ్స్, సమ్‌వన్‌ విల్‌ హైర్‌ యు టు బిల్డ్‌ దెయిర్‌ డ్రీమ్స్‌’’ లాంటి మరపురాని డైలాగులు చాలానే ఉన్నాయి.  

తమన్‌ సంగీతంలో ఈ సినిమాలో పదే పదే వచ్చే థీమ్‌ మ్యూజిక్, ‘నా చిన్ని లోకమే చేజారిపోయెనే..’ అనే బిట్‌ సాంగ్‌ (రచన – నీరజ కోన) కొన్నాళ్ళ పాటు చెవుల్లో రింగుమంటాయి. అమెరికా నేపథ్యం, నిర్మాణ విలువలు బాగున్నా... కథనంలోని లోపాలు ఈ సినిమాకు శాపాలు. అసలు పోరాటం ఆరంభం కాకపోవడంతో, సినిమా ఫస్టాఫ్‌ నిదానంగా సాగుతుంది. అసలు కథ మొత్తం సెకండాఫ్‌లో చెప్పాల్సి వచ్చేసరికి తొలి చిత్ర దర్శకుడు తడబడ్డారు. తాత పేరును అందరికీ తెలిసేలా చేస్తాననే హీరోయిన్, అసలు పోరాటంలో ఆ ఊసే ఎత్తకపోవడం లాంటి లోపాలూ ఉన్నాయి.

వెరసి, ఏ రంగమైనా పురుషుల గుత్తసొత్తు కాదు, ఆధునిక ప్రపంచంలో అమ్మాయిలు అన్నింటిలోనూ ముందుంటారనే మంచి పాయింట్‌ను తీసుకున్నా, దాన్ని సరైన స్క్రిప్టుగా తీర్చిదిద్దలేకపోయారు. కథన లోపాలతో, కథ తడబడితే ఎలా ఉంటుందో చూడడానికి ‘మిస్‌ ఇండియా’ మరో ఉదాహరణ. అతి సినిమాటిక్‌ లిబర్టీలు, పాత్రల మీద ప్రేక్షకులకు సహానుభూతి కలగనివ్వని ఫేక్‌ ఎమోషన్లు ఇందులో పుష్కలం. అందుకే, బలమైన పాయింట్, పేరున్న పెర్ఫార్మర్లు ఉన్నా... ‘మిస్‌ ఇండియా’ వెండితెరపై వెలవెలపోయింది.
కొసమెరుపు: టార్గెట్‌ ‘మిస్‌’ అయింది!

బలాలు: కీర్తీసురేశ్, జగపతిబాబు లాంటి నటులు ∙తళుక్కున మెరిసే మంచి డైలాగులు ∙థీమ్‌ మ్యూజిక్, ‘నా చిన్నిలోకమే..’ బిట్‌ సాంగ్‌ ∙అమెరికా నేపథ్యం, నిర్మాణ విలువలు
బలహీనతలు: ∙కథనంలో, క్యారెక్టరైజేషన్‌లో లోపాలు ∙స్లోగా సాగే ఫస్టాఫ్‌. కీలకమైన సెకండాఫ్‌లో తడబాట్లు ∙అతి సినిమాటిక్‌ లిబర్టీలు, ఫేక్‌ ఎమోషన్లు ∙అందాల పోటీ గురించి అని పొరబడేలా చేసే టైటిల్‌ ∙తేలిపోయిన క్లైమాక్స్‌

– రెంటాల జయదేవ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement