
‘బుట్టబొమ్మా బుట్టబొమ్మా.. నన్ను సుట్టూకుంటివే’ అంటూ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో పూజా హెగ్డే చుట్టూ తిరుగుతూ అల్లు అర్జున్ చేసిన సందడి భలే ఉంటుంది. బుట్టబొమ్మలా పూజ కూడా భలే ఉంది. ఇప్పుడు హిందీలో బుట్టబొమ్మ ఎవరు? అనే చర్చ జరుగుతోంది. ‘అల వైకుంఠపురములో’ హిందీలో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటుడు వరుణ్ ధావన్ సోదరుడు రోహిత్ ధావన్ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో కథానాయికగా కృతీ సనన్‌ని అడిగారని సమాచారం.
ప్రస్తుతం వరుణ్ ధావన్ సరసన కృతీ సనన్ నటిస్తున్న హిందీ చిత్రం ‘భేదియా’ ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఇది కాకుండా అక్షయ్ కుమార్ సరసన ‘బచ్చన్ పాండే’ చిత్రంలో నటిస్తున్నారామె. ఇటీవలే ప్రభాస్ ప్యాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’లో సీత పాత్రకు ఎంపికయ్యారు కృతీ సనన్. ఒకసారి డైరీ చెక్ చేసుకుని ‘అల వైకుంఠపురములో’ రీమేక్‌కి డేట్స్ సర్దుబాటు చేయాలనుకుంటున్నారట. జూన్‌లో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కానుంది. మరి బుట్టబొమ్మగా కృతీయే కనబడతారా? వేరే కథా నాయిక సీన్లోకి వస్తారా? వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment