∙కేతకీ నారాయణ్, మహి వి. రాఘవ్, జీవా
‘‘యాత్ర 2’లోని పాత్రలు ఎవర్నీ కించపరిచేలా ఉండవు. ఏ పార్టీనీ విలన్‌గా చూపించలేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిగారి మరణం తర్వాత ఇచ్చిన మాట కోసం (ఓదార్పు యాత్ర) కొడుకుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు చేసిన భావోద్వేగ ప్రయాణాన్ని మాత్రమే చూపించాను’’ అన్నారు దర్శకుడు మహి వి. రాఘవ్. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో మహి వి. రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర’ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వైఎస్‌ఆర్ పాత్రను మమ్ముట్టి చేయగా, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా, వైఎస్ భారతీ రెడ్డి పాత్రలో కేతకీ నారాయణ్ నటించారు.
త్రీ ఆటమ్ లీవ్స్, వి సెల్యూలాయిడ్‌తో కలసి శివ మేక నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మహి వి. రాఘవ్ మాట్లాడుతూ– ‘‘మమ్ముట్టిగారు, జీవా, కేతకి, శివ మేక, నేను, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, కెమెరామేన్ మది.. ఇలా యూనిట్ అందరి వల్లే ‘యాత్ర 2’ బాగా వచ్చింది. జీవా అద్భుతమైన నటుడు. జగన్ అన్న పాత్రకి న్యాయం చేయగలడనే నమ్మకంతో ఎంచుకున్నాను. తెలుగు రాకపోయినా డైలాగ్స్ నేర్చుకుని అంకితభావంతో చేశాడు. ‘యాత్ర 2’ కథ, ప్రారంభం, ముగింపు అందరికీ తెలిసి ఉండొచ్చు. కానీ సినిమాను ఎలా తీశాం, ఏ భావోద్వేగాలతో నడిపించామన్నది ఎవరికీ తెలియదు.
టీజర్, ట్రైలర్‌లో చూసిన ఇలాంటి ఎన్నో ఎమోషనల్ సీన్స్, ప్రజలకు తెలియని ఎన్నో అంశాలు సినిమాలో ఉంటాయి. ఈ మూవీలో వైఎస్‌ఆర్‌గారి మరణానికి సంబంధించిన కారణాలు చూపించలేదు. జగన్‌గారు ఢిల్లీ పెద్దలను ఎదిరించడం, సీఎం అయిపోవడం అనేది నా కథ కాదు. ఒక పాత్రని హీరో చేయడం కోసం ఇంకో పాత్రను తక్కువ చేసి చూపించాల్సిన అవసరం లేదు. మనమంటే గిట్టనివారు మనపై రాళ్లు వేస్తుంటారు.. బురద జల్లుతుంటారు.. అలాంటి వారిని పట్టించుకోకపోవడమే మంచిది’’ అన్నారు. జీవా మాట్లాడుతూ– ‘‘మహీగారు నాకు కథ చెప్పి, వైఎస్ జగన్‌గారి పాత్ర అన్నప్పుడు షాక్ అయ్యాను.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నాకు అవగాహన లేదు. కానీ జగన్‌గారి పాత్ర చేయడం బాధ్యతగా అనిపించింది. జగన్‌గారు ఎలా మాట్లాడతారు? ఎలా నడుస్తారు? అని వీడియోలు చూసి తెలుసుకున్నాను. మహీగారు ఈ పాత్రకు నన్ను ఓకే చేయడానికే చాలా టైమ్ తీసుకున్నారు. తొలి సన్నివేశం ఆయన ఓకే చెప్పడంతో నాకు పెద్ద ఉపశమనం అనిపించింది. నేను ఇప్పటివరకూ వైఎస్ జగన్‌గారిని కలవలేదు.. కలిసే చాన్స్ వస్తే వదులుకోను. ‘యాత్ర 2’ విడుదల తర్వాత జగన్‌గారు మమ్మల్ని పిలిచి, అభినందిస్తారనే నమ్మకం ఉంది. ‘యాత్ర 2’ చేస్తున్నప్పుడు ప్రతిపక్షాల నుంచి నాకెలాంటి బెదిరింపు కాల్స్ రాలేదు.
అయితే ‘యాత్ర’ చేస్తున్నప్పుడు మీకేమైనా అలాంటి కాల్స్ వచ్చాయా? అని మమ్ముట్టిగారిని అడిగాను. ‘మనం యాక్టర్స్.. ఇది క్రియేటివ్ స్పేస్.. దీన్ని కేవలం సినిమాలానే చూడు’ అని ఆయన చెప్పారు. ఈ మూవీలోని ‘చూడు నాన్నా’ పాట తీస్తున్నప్పుడు చాలా ఎమోషన్‌కు లోనయ్యాను. పులివెందులలో షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడి ప్రజల ప్రేమ, అభిమానం మరచిపోలేను. నా కెరీర్‌లో ‘యాత్ర 2’ తప్పకుండా ఓ మైలురాయిగా నిలుస్తుందని కచ్చితంగా చెప్పగలను’’ అన్నారు. కేతకీ నారాయణ్ మాట్లాడుతూ– ‘‘నేను మరాఠీ, హిందీ సినిమాలు చేశాను. తెలుగులో ‘యాత్ర 2’ నా మొదటి చిత్రం. తొలిసారి ఓ రియల్ పాత్ర చేశాను. పాత్రకు తగ్గ భావోద్వేగాలు పండించాను. పులివెందులలో షూటింగ్ చేసినప్పుడు అక్కడి మహిళలు నన్ను హత్తుకుని ఆ΄్యాయతతో మాట్లాడారు. అప్పుడు ఆ పాత్రలోని ఇంటెన్సిటీ నాకు అర్థమైంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment