రామ్‌చరణ్ బర్త్‌డేను పురస్కరించుకుని అతడి తల్లి, చిరంజీవి సతీమణి సురేఖ బుధవారం నాడు (మార్చి 27న) అన్నదానం చేశారు. ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అంచెలంచెలుగా ఎదిగిన చరణ్‌ను కొనియాడుతూ ఓ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ వేదికపై మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
చరణ్‌కు ఉన్న గొప్ప గుణం..
మనోజ్ మాట్లాడుతూ.. 'నా ప్రాణ స్నేహితుడు రామ్‌చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా చిన్నప్పుడు చెన్నైలో అందరి ఇల్లు పక్కపక్కనే ఉండేవి. మేమంతా కలిసి ఉండేవాళ్లం. చిన్నప్పటినుంచి చరణ్‌కు ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే.. కష్టాల్లో ఉన్నానంటూ ఎవరైనా వస్తే వారికి సాయం చేస్తుంటాడు. ఈ రోజుల్లో అంత పెద్ద మనసు ఎవరికీ ఉండదు. చరణ్ స్నేహితుడిగా తన గురించి మాట్లాడాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చాను.
తెలుగింటి పిల్లకు కష్టం
ఈ రోజుల్లో విలువైనది స్నేహం. అతడు తన చిన్ననాటి స్నేహితుల నుంచి ఇప్పటి ఫ్రెండ్స్ వరకు అందరితోనూ టచ్‌లో ఉన్నాడు. స్నేహానికి అంత విలువిస్తాడు. ఒకసారి ఏమైందంటే? దుబాయ్‌లో ఒక తెలుగింటి ఆడపిల్లకు కష్టమొచ్చింది. అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదు. ఏం చేయాలో అర్థం కాక అర్ధరాత్రి చరణ్‌కు ఫోన్ చేశాను. మిత్రమా, దుబాయ్‌లో ఓ ఆడపిల్ల చిక్కుకుపోయింది.
చిరంజీవి, మోహన్‌బాబు మధ్యలోకి వెళ్లకూడదు
నా వంతు నేను చేశాను. ఐదు లక్షలు తక్కువయ్యాయిరా.. ఏం చేయాలిరా? అని అడిగాను. వెంటనే అకౌంట్ నెంబర్ పంపించు అని క్షణంలో డబ్బు పంపించాడు. అంత గొప్పవాడు. మీ నాన్నలిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. మీరు మాత్రం ఎలా కలిసుంటారని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్యలోకి మనం ఎప్పుడూ వెళ్లకూడదు. వాళ్లిద్దరు కూడా అంతే.. కొట్టుకుంటారు, కలిసిపోతారు. క్యూట్ టామ్ అండ్ జెర్రీలాగా! పొరపాటున కూడా వాళ్ల మధ్య మనం దూరకూడదు' అని మనోజ్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment