ఒక్క సిరీస్‌... తొమ్మిది రసాలు | Mani Ratnam Navarasa Web Series Updates | Sakshi
Sakshi News home page

ఒక్క సిరీస్‌... తొమ్మిది రసాలు

Published Thu, Sep 24 2020 12:09 AM | Last Updated on Thu, Sep 24 2020 8:07 AM

Mani Ratnam Navarasa Web Series Updates - Sakshi

రసాలు తొమ్మిది... హాస్యం, రౌద్రం, కరుణ, బీభత్సం, శాంతం, శృంగారం, భయానకం, వీరం, అద్భుతం. సినిమాల్లో మనం కొన్ని రసాలు మాత్రమే చూస్తుంటాం. ఒకే సినిమాలో అన్ని రసాలు చూపించడం కుదరదు. కానీ ఓ వెబ్‌ సిరీస్‌ ద్వారా తొమ్మిది రసాలను చూపించడానికి ప్లాన్‌ సిద్ధం చేశారు దర్శకుడు మణిరత్నం. ‘నవరస’ అనే పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ నిర్మించనున్నారాయన. ఈ సిరీస్‌లో 9 కథలు ఉంటాయి. 9 రసాలతో అవి తెరకెక్కునున్నాయి. తొమ్మిది మంది దర్శకులు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ విశేషాలు.

కరోనా వల్ల ఓటీటీలకు ఆదరణ మరింత పెరిగింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలను నేరుగా విడుదల చేస్తున్నారు. స్టార్స్‌ కూడా ఓటీటీల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నారు. పలువురు దర్శకులు షోలు, సిరీస్‌లు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాదిన తెరకెక్కనున్న వెబ్‌ సిరీస్‌లో ఆసక్తికరమైన వాటిలో ‘నవరస’ ఒకటి. ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం మణిరత్నం ఈ ఐడియాతో ముందుకొచ్చారు. ‘నవరస’ పేరుతో తెరకెక్కబోయే ఈ సిరీస్‌లో ఒక్కో కథ ఒక్కో రసం ఆధారంగా తెరకెక్కుతుందని సమాచారం.

ఒక కథ పూర్తి హాస్య ప్రధానమైతే మరోటి భయానకం. ఇంకోటి శృంగారం. ఈ కథలను మణిరత్నం, గౌతమ్‌ మీనన్, కేవీ ఆనంద్, బిజోయ్‌ నంబియార్, రతీంద్రన్‌ ప్రసాద్, పొన్‌రామ్, కార్తీక్‌ నరే¯Œ , అరవింద స్వామి, సిద్ధార్థ్‌ తెరకెక్కిస్తారు. ఈ తొమ్మిది మంది దర్శకుల్లో నటులు అరవింద స్వామి, సిద్ధార్థ్‌ ఈ సిరీస్‌ ద్వారా దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. అలాగే ఇదే సిరీస్‌ ద్వారా సూర్య తొలిసారి వెబ్‌ సిరీస్‌లో భాగమవుతున్నారని సమాచారం. మణిరత్నం తెరకెక్కించనున్న భాగంలో సూర్య నటిస్తారట.

పొన్‌రామ్‌ దర్శకత్వం వహించే భాగంలో మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తారు. రతీంద్రన్‌ ప్రసాద్‌ కథలో సిద్ధార్థ్, పార్వతీ మీనన్‌ జంటగా నటిస్తారు. అలాగే సీనియర్‌ నటి స్నేహ, జై, విజయ్‌ సేతుపతి కూడా ఈ సిరీస్‌లో కనిపిస్తారు. దర్శకత్వం వహించడంతో పాటు సిద్ధార్థ్, అరవింద స్వామి ఈ సిరీస్‌లో నటించనున్నారు. అరవింద స్వామి దర్శకత్వం వహించే విభాగంలో ఆయనే కీలక పాత్రలో కనిపిస్తారట. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.  మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement