ముంబైలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఒకవైపు ప్రభుత్వం టెన్షన్ పడుతోంది. మరోవైపు సెలబ్రిటీలు కాసింత మైమరిచి ప్రవర్తించి చిక్కులు పడుతున్నారు. నటుడు వివేక్ ఒబెరాయ్‌పై తాజాగా కేసు బుక్ అయ్యింది. ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదైంది. దానికి కారణం హీరోగారి ఉత్సాహం. వేలెంటైన్స్ డే సందర్భంగా వివేక్ తన భార్య ప్రియాంకా అల్వాతో కలిసి హార్లి–డేవిడ్‌సన్ బైక్ మీద ముంబై వీధుల్లో షికారు చేశాడు. అంతేనా! చుట్టుముట్టిన అభిమానులతో ఫొటోలు దిగాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అక్కడి నుంచి సమస్య మొదలైంది. సోషల్ మీడియాలో అతణ్ణి చూసిన నెటిజన్లు ‘మాస్క్ ఏది? హెల్మెట్ ఏది?’ అని ప్రశ్నించడం మొదలెట్టారు. వెంటనే పోలీసులు రంగంలో దిగి హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు 500 రూపాయల ఫైన్ వేశారు. అది చెల్లించడం సులభం.
భార్య ప్రియాంకా అల్వాతో వివేక్
అయితే మాస్క్ లేకుండా బాధ్యతారహితంగా తిరిగినందుకు సెక్షన్ 269 ప్రకారం కేసు నమోదైంది. మహమ్మారి సమయంలో అది వ్యాపించేలా తిరిగే వ్యక్తులపై ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. అయితే ఈ వ్యవహారంలో వివేక్ స్పందన ఇంకా తెలియలేదు. ఒకవైపు భార్యతో కలిసి ఏదో సరదాగా బయలుదేరాడనుకునేవారు ఉండొచ్చు. మరోవైపు ఇలా శిక్షించేలా ఉండాల్సిందే అనేవారూ ఉండొచ్చు. కాని వివేక్ చిన్నవాడేమి కాదు. ఏకంగా నరేంద్రమోది పాత్రను పోషించి ‘పి.ఎం. నరేంద్రమోదీ’ సినిమాలో నటించాడు. ఇంకా పెద్ద సినిమాలలో నటిస్తున్నాడు. కనుక ఈ కేసులు అతణ్ణి ఏమి చేస్తాయో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment