‘బొమ్మరిల్లు’ భాస్కర్, అఖిల్, పూజా హెగ్డే, అల్లు అరవింద్, నాగచైతన్య, గోపీసుందర్, వాసూవర్మ
‘‘అఖిల్ ఓ సినిమా ఫలితం కన్నా దానికి ప్రిపేర్ అయ్యే విధానాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు.. తనలో అదే నాకు బాగా ఇష్టం. రానున్న ఐదారేళ్లల్లో ఎలాంటి సినిమాలు, ఎలాంటి పాత్రలు చేయాలనే మాస్టర్ ప్లాన్ తన మైండ్‌లో ఉంటుంది. ‘సిసింద్రీ’ నుంచి ఇప్పటివరకు తనను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. ప్రతి ఏడాది ఇంట్లో కొత్త అఖిల్‌ని చూస్తుంటాను.. తను ఓ సినిమాకి అంత అంకితం అవుతాడు’’ అన్నారు నాగచైతన్య. అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అల్లు అరవింద్ సమర్పణలో దర్శకడు వాసూ వర్మతో కలిసి బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా జరిపిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘నా తొలి చిత్రం ‘జోష్’కి వాసూ వర్మ దర్శకత్వం వహించారు.. ఆ సినిమాతో చాలా నేర్చుకున్నాను. బన్నీ వాసుతో ‘100›పర్సెంట్ లవ్’ చిత్రం చేశాను. తన ప్రయాణం చూస్తే గర్వంగా ఉంది. అరవింద్‌గారు కథ ఓకే చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అంటారు.. అది అలాగే ఉండాలి. ఒక సక్సెస్‌ఫుల్ మూవీ తీయాలంటే అంత కేర్ ఉండాలి.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్ చూస్తుంటే ఓ సెలబ్రేషన్‌లా అనిపించింది.. ఇలాంటి సమయంలో థియేటర్స్‌లో మన ప్రేక్షకులకు సెలబ్రేషన్ కావాలి.. ఈ సినిమా ఆ సెలబ్రేషన్‌ని ఇస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో అఖిల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పగలను. భాస్కర్ ఈ సినిమాను బాగా తీశాడు’’ అన్నారు.
నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ అంటే రామానాయుడుగారిని చూశాం.. ఇప్పుడు అరవింద్‌గారిని చూస్తున్నాం. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి యూత్‌ఫుల్ సినిమాతో అఖిల్ హిట్ కొట్టబోతున్నాడు’’ అన్నారు.
బన్నీ వాసు మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌లో ఓ మంచి సినిమా తీశానని గర్వంగా చెప్పుకోగలిగిన సినిమా ఇది. చైతూగారి ‘100 పర్సెంట్ లవ్’ సినిమాతో నిర్మాతగా మారాను. ఇప్పుడు అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నా కెరీర్‌ను మరో మెట్టు ఎక్కిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘ఈ టీమ్‌లో నన్ను భాగస్వామి చేసిన అరవింద్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు వాసూ వర్మ. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘మీ వెనకాల (నాగచైతన్య, అఖిల్) అక్కినేని లాయల్ ఫ్యాన్స్ ఎప్పుడూ ఉంటారు. అయితే అఖిల్‌ని తెలుగు ప్రేక్షకులందరి వద్దకూ చేర్చాలన్నదే నా ప్రయత్నం.. అది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంతో కచ్చితంగా జరుగుతుంది’’ అన్నారు.
అఖిల్ మాట్లాడుతూ – ‘‘నాపై నమ్మకం ఉంచిన అక్కినేని అభిమానులకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టే వరకు నేను నిద్రపోను.. నాకు నిద్ర రాదు. నేను నిద్రపోలేను. ఇది ఖాయం’’ అన్నారు. హీరోయిన్ పూజా హెగ్డే, నటి ఆమని, సంగీత దర్శకుడు గోపీ సుందర్, దర్శకులు హరీష్ శంకర్, మారుతి, నిర్మాత అల్లు బాబీ, పాటల రచయిత శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment