'మళ్లీ పెళ్లి' సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లిన నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతికి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. మెరిట్ లేని కారణంగా ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ బెంగళూరు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మళ్ళీ పెళ్లి(తెలుగు), మట్టే మదువే (కన్నడ) చిత్రాన్ని థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ప్రసారం చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. అంతేకాకుండా నరేష్ ఇంట్లోకి రమ్య రఘుపతికి అనుమతి లేదని కూడా కోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై ప్రముఖ మీడియా సంస్ధతో ఆయన ఇలా మాట్లాడారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో 'బేబి' ప్రయోగం.. ఆ సీన్లను కలిపేందుకు ప్లాన్)
'ఆమెకు (రమ్య రఘుపతి) చాలా అప్పులు ఉన్నాయి, అప్పులు వసూలు చేసేవారు మా ఇంటికి వస్తున్నారు. ఇది మా కుటుంబంలోని సభ్యులకు (తల్లి వైపు) కూడా ఇబ్బందిగా ఉంది. అందువల్ల మేము కోర్టు రక్షణను కోరాము. ఇప్పుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించకూడదని బెంగళూరు కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.' అని నరేష్ తెలిపారు.
అంతే కాకుండా నరేష్, రమ్య ఇద్దరూ విడిగా ఉన్నారనే విషయాన్ని కూడా ఆర్డర్ కాపీలో కోర్టు పేర్కొందని ఆయన తెలిపారు. గత 6 సంవత్సరాలుగా తామిద్దరం కలిసి జీవించడం లేదని కోర్టు కూడా నిర్ధారించిందని పేర్కొన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పు తమ విడాకులకు మార్గం సుగమం అయిందన్నారు. అందుకు సంబంధించి తాను ఇప్పటికే కూకట్‌పల్లి కోర్టులో విడాకుల కోసం పిటీషన్ దాఖలు చేసినట్లు తెలిపిన నరేష్ ఈ తీర్పు ఎంతగానో సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: ఇది రాకేశ్ మాస్టర్ విగ్రహమా? పుల్లయ్యలా ఉందంటూ విమర్శలు)
ఈ ఏడాది ప్రారంభంలో రమ్య నుంచి విడాకుల కోరుతూ కూకట్‌పల్లి కోర్టులో తమ వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి తన చుట్టు ఎన్నో వివాదాలు వచ్చాయని నరేష్ ఇలా తెలిపారు. 'నేను, పవిత్ర లోకేష్‌తో కలిసి వుండటాన్ని కొంతమంది పలు రకాలుగా మాట్లాడుకున్నారు. నా వ్యక్తిగత జీవితం గురించి చాలామంది ఊహాగానాలు చేస్తుంటే, నేను ఎలాంటి నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఇకనుంచి అయినా నేను ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నాను కాబట్టి ఈ కేసు వల్ల విడాకుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను.' అని నరేష్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment