
తమిళ సినిమా: వివాహానంతరం కొత్త చిత్రాలు కమిటవ్వడంలో తగ్గేదేలే అంటోంది నయనతార. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాలు చేయాలంటే దక్షిణాదిలో ఈమె తరువాతే ఎవరైనా అన్నంతగా నయనతార ముద్ర వేసుకుంది. ఈ అమ్మడు అన్ని విధాలుగా ఆలోచించే పెళ్లయిన తర్వాత సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లి అయినట్లు ఉంది. వివాహానంతరం నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా కొనసాగుతుందని జరిగిన ప్రచారాన్ని తలకిందులు చేసింది. వచ్చిన అవకాశాలను వదులుకునేదేలే అంటోందనిపిస్తోంది.
ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఈమె హీరోయిన్ సెంట్రింగ్ పాత్రలో నటించిన గోల్డ్, కనెక్ట్, హిందీలో షారూఖ్‌ఖాన్‌తో జత కట్టిన జువాన్ చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో వరుసగా విడుదలకు సిద్ధవుతున్నాయి. తాజాగా పాన్పు, ఆటో జానీ, జయం రవి సరసన ఇరైవన్ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే దర్శకుడు దొరై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతోంది.
తాజాగా నయనతార నటించిన కొత్త చిత్రం గురించి సమాచారం వెలుగు చూసింది. ఇంతకుముందు కేజీఎఫ్ పార్ట్1, పార్ట్ 2, కాంతార వంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించనున్న భారీ చిత్రంలో నయనతార నటించడానికి కమిట్ అయినట్లు సమాచారం. ఇది హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రం అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా నయనతార నటిస్తుందంటే అది కచ్చితంగా పాన్ ఇండియా చిత్రమే అవుతుందని భావించవచ్చు.