
టాలీవుడ్‌లోని స్వీట్ కపుల్‌లో మెగా డాటర్ నిహారిక- చైతన్య జొన్నలగడ్డ జంట ముందువరుసలో ఉంటుంది. నాగబాబు ముద్దుల కూతురైన నిహారిక, వ్యాపారవేత్త చైతన్య జొన్నలగడ్డ వివాహం 2020 డిసెంబర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. చైతన్య కామ్ అండ్ కంపోజ్‌డ్ అయితే నిహారిక తెగ అల్లరి పిల్ల. వీరి ఈడూజోడీ చూసి అందరూ ముచ్చటపడ్డారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే వీరిద్దరూ తరచూ తమ ఫోటోలను అభిమానులతో పంచుకునేవారు. ఏమైందో ఏమో కానీ, ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ దంపతులు కొంతకాలంగా సైలెంట్ అయ్యారు.
వెకేషన్స్, పార్టీలంటూ జంటగా తిరిగే వీళ్లిద్దరూ బయట కలిసి కనిపించడం లేదు. అటు సోషల్ మీడియాలో కూడా సింగిల్‌గానే ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. చైతన్య అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలను డిలీట్ చేశాడు. నిహారికతో కలిసి ఉన్న పిక్స్ సైతం డిలీట్ చేయడంతో నెట్టింట బ్రేకప్ రూమర్స్ మొదలయ్యాయి. వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ జంట విడిపోతుందనే వార్తలు చూసి మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అయితే ఇలా విడాకుల రూమర్లు రావడం కొత్తేమీ కాదు. గతేడాది సైతం నిహారిక, చైతన్య విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. నిహారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడంతో వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, విడిపోతున్నారేమోనని అంతా భావించారు. ఆ సమయంలో చైతన్య ఈ రూమర్లకు చెక్ పెడుతూ తామిద్దరూ కలిసి దిగిన ఫోటో షేర్ చేయడంతో ఆ ప్రచారానికి తెర పడింది. కానీ ఈసారి ఏకంగా చైతన్యే.. పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంతో ఇదేదో సీరియస్ విషయంలా ఉందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. ఇకపోతే చైతన్య జొన్నలగడ్డ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిబ్రవరి 15న చివరిసారి ఓ ఫోటో షేర్ చేశాడు. దీని కింద అందరూ బ్రేకప్ చెప్పుకున్నారా? పెళ్లి ఫోటోలు ఎందుకు డిలీట్ చేశారు? నిహారిక ఎక్కడ? అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment