అదే వేదిక. అదే వేడుక. సంబరాల్లో పెద్ద మార్పులు లేవు. ఆస్కార్ వేడుకలు ఎప్పటిలానే జరగనున్నాయి. కోవిడ్ వల్ల సినిమాల విడుదలలు, ఫిల్మ్ ఫెస్టివల్స్ అన్నీ వాయిదా పడ్డాయి. కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్‌ను వర్చువల్ (ఆన్‌లైన్)గా నిర్వహించారు. ఆస్కార్ వేడుక కూడా వర్చువల్‌గా జరుగుతుందని చాలామంది అనుకున్నారు. కానీ ఎప్పటిలానే వేడుకలు జరుగుతాయని నిర్వాహకులు స్పష్టం చేశారు.
93వ ఆస్కార్ వేడుక వచ్చే ఏడాది ఏప్రిల్ 25న జరగనుంది. సాధారణంగా ఆస్కార్ పండగను ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 28న ఈ వేడుక నిర్వహించాలని ముందు అనుకున్నారు. అయితే కోవిడ్ వల్ల ఓ రెండు నెలలు వాయిదా వేశారు. ఇప్పుడు కూడా పరిస్థితి పెద్దగా మారినట్టేం లేదు. దాంతో మిగతా చలన చిత్రోత్సవాల్లా ఆస్కార్‌ను కూడా ఆన్‌లైన్‌లో చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే కోవిడ్ మార్గదర్శకాలతో పూర్తి స్థాయిలోనే ఈ వేడుకను నిర్వహించే ఆలోచనలో ఆస్కార్ అవార్డు కమిటీ ప్లాన్ చేస్తోంది.
ఆస్కార్ ఫంక్షన్‌ను లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో నిర్వహిస్తారు. దీని సీటింగ్ కెపాసిటీ 3,400. మరి ఇంతమందిని ఒక దగ్గరకు తీసుకువచ్చి వేడుక నిర్వహిస్తారా? లేదా ఏదైనా కొత్త పద్ధతిలో వేడుక నిర్వహించే ఆలోచనలో ఉన్నారో చూడాలని ఓ హాలీవుడ్ మేగజీన్ రాసుకొచ్చింది. ఒకవేళ అవార్డు నామినేషన్ దక్కినవాళ్లందర్నీ పిలిచి ఈ వేడుక నిర్వహించాలని ఆలోచించినా ఓ చిక్కు ఉంది. ఈసారి ఆస్కార్ నామినేషన్ల రేస్ (ఇంకా ప్రకటించలేదు. కేవలం ఊహాగానాలు)లో ఉన్న యాక్టర్స్‌లో చాలామంది 70 ఏళ్లకు మించిన వాళ్లు ఉన్నారు.
వాళ్లందరూ వేడుకకు రావడానికి ఆసక్తి చూపిస్తారా? అనే సందేహం ఆస్కార్ అవార్డు కమిటీకి ఉండొచ్చు. ఇక ఆస్కార్ వేడుకకు ముందు హాలీవుడ్‌లో ఓ నాలుగు అవార్డు (గోల్డెన్ గ్లోబ్స్, క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్, బాఫ్టా, ఎస్‌ఎజి) ఫంక్షన్లు జరగనున్నాయి. ఈ వేడుకల జరిగే తీరును బట్టి ఆస్కార్ అవార్డుల వేడుకలో మార్పులు చేర్పులకు అవకాశం ఉందని హాలీవుడ్ అంటోంది.‘‘ప్రస్తుతానికి మేం ఉన్న ఆప్షన్స్ అన్నీ చూస్తున్నాం. కానీ ఆస్కార్‌ను అందరి సమక్షంలోనే చేయడానికి ఆలోచిస్తున్నాం’’ అని ఆస్కార్ ప్రతినిధులు అంటున్నారు.
వాయిదా నాలుగోసారి...
సాధారణంగా జనవరి నెల నుంచి ఆ ఏడాది చివరి వరకూ థియేటర్స్‌లో విడుదలయ్యే చిత్రాలకు ఆస్కార్ పోటీలో నిలబడే అర్హత ఉంటుంది. కానీ ఈసారి 2020 జనవరి నుంచి 2021 ఫిబ్రవరి వరకూ విడుదలయ్యే సినిమాలు కూడా ఆస్కార్ రేసులో అర్హత పొందుతాయి. ఇలా రెండు సంవత్సరాల్లో విడుదలయ్యే సినిమాలను ఆస్కార్ వేడుకకు పరిశీలించడం గత 85 ఏళ్లలో ఇదే తొలిసారి. అలానే థియేటర్స్‌లో విడుదల కాకపోతే ఆస్కార్‌కు సినిమాను పంపలేం. కోవిడ్ వల్ల ఈ నిబంధనను కూడా తప్పించింది అకాడమీ. అకాడమీ చరిత్రలో అవార్డులు వేడుక పోస్ట్‌పోన్ అవ్వడం ఇది నాలుగోసారి.
గత నెలలో ఎమ్మీ అవార్డులు మొత్తం వర్చువల్‌గా జరిగాయి. లాస్ ఏంజెల్స్‌లో ఈ వేడుక జరిగింది. వేదిక మొత్తం ఖాళీ. ఆవార్డు నామినేషన్ పొందిన వాళ్లంతా ఎవరింట్లో వాళ్లు ఉండి ఆన్‌లైన్‌లో ఈ వేడుకలో పాల్గొన్నారు. అంతకు ముందు జరిగిన వెన్నిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అతి తక్కువమంది పాల్గొన్నారు. ఎప్పుడూ పాల్గొనేవారి కన్నా సంఖ్యలో సగంకన్నా తక్కువమంది హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment