తెలుగు ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరావు.. వీరిద్దరూ 300కు పైగా సినిమాలకు రచయితలుగా పని చేశారు. కొన్ని సినిమాలకు దర్శకత్వం సైతం వహించారు. ఇద్దరూ సినిమాల్లోనూ నటించారు. అయితే పరుచూరి వెంకటేశ్వరావు వృద్దాప్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉండగా గోపాలకృష్ణ ఎప్పటికప్పుడు సినీవిశేషాలను పంచుకుంటూ యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నాడు.
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'నా డైరెక్షన్‌లో శోభన్‌బాబుతో ఓ సినిమా తీశాను. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో కోర్టు సీనులో రామానాయుడుగారు ట్రాలీ తోసేవారు. ఏం డైలాగులు రాసావయ్యా అని మెచ్చుకునేవారు. ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని సురేశ్‌బాబు ముందే అన్నారు. అన్నట్లే జరిగింది. మంచి విజయం సాధించింది. దీంతో దేవీప్రసాద్, త్రివిక్రమ్ రావు, అశ్వినీదత్.. అందరూ తమ బ్యానర్‌లో నెక్స్ట్ సినిమా చేయాలంటూ అడ్వాన్సులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కృష్ణ లేదా శోభన్‌బాబును హీరోగా పెట్టి సినిమా చేయమని డబ్బుల కట్టలు ముందు పెట్టి అడిగారు.
ఆరోజు కనక అడ్వాన్స్ తీసుకునుంటే శంకరపల్లిలో నాకు వంద ఎకరాల భూమి ఉండేది. అప్పుడు ఎకరం పదివేల రూపాయలు మాత్రమే! సురేశ్‌బాబు అప్పటికే పక్కనుంచి అంటున్నాడు. మీ అన్న వెంకటేశ్వరావును డబ్బు తీసుకోమనండి. నేను ఆల్‌రెడీ భూమి కొనుక్కున్నా. మీ అన్నదమ్ములిద్దరికీ చెరో 50 ఎకరాలు కొనిస్తానని చెప్పాడు. భవిష్యత్తులో అది మీకే పనికొస్తుందని సలహా ఇచ్చాడు. కానీ మా అన్నయ్య వద్దన్నాడు. వాడు డైరెక్టర్ అయితే నేను ఫిడేలు వాయించుకోవాలా? అన్నాడు. అన్నకు ఇష్టం లేనిది నేను చేయనని చెప్పాను. కానీ తర్వాత మాత్రం తను చాలా బాధపడ్డాడు' అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment