లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. ఈ మూవీ మొదటి భాగం గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన భారీ విజయం సాధించింది. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అంతగా ఆదరించపోయినా.. తమిళంలో మాత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం రెండో భాగం రేపు (ఏప్రిల్ 28)న విడుదల కాబోతుంది. మొదటి భాగంలో మిగిలిపోయిన అనేక సందేహాలకు ఈ చిత్రంలో సమధానాలు దొరకనున్నాయి. అసలు పార్ట్ 1లో చెప్పిన స్టోరీ ఏంటి? పార్ట్ 2లో ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించబోతున్నాయి?
నందిని ప్లాష్‌బ్యాక్ ఏంటి?
ఆదిత్య కరికాలుడు(విక్రమ్) ప్రేమించిన యువతి నందిని(ఐశ్వర్యరాయ్)ని పెద్ద పళవేట్టురాయల్ పెళ్లి చేసుకున్నట్లు పార్ట్ 1లో చూపించారు. ఆమె అనాథ అయిన కారణంగా ఆదిత్య చెల్లి కుందవై(త్రిష) నందినిని తన సోదరుడుకి దక్కకుండా చేస్తుంది. ఒకవైపు యుద్దం చేస్తునే.. మరోవైపు నందిని కోసం వెతుకుతాడు కరికాలుడు. అప్పటికే పాండ్యరాజు నందినిని కూతురిలా పెంచుకుంటాడు. వీరిని కరికాలుడు చూస్తాడు. పాండ్యరాజును హత్య చేయ్యొద్దని వేడుకున్నా.. కరికాలుడు అతడిని చంపేస్తాడు. ఆ కోపంతో నందిని చోళ రాజ్య కోశాధికారి పళవేట్టు రాయర్‌ని పెళ్లి చేసుకొని తంజావురుకు వచ్చినట్లు పార్ట్ 1లో చూపించారు. అసలు నందిని నేపథ్యం ఏంటి? పాండ్య రాజుని ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చింది? పెద్ద పళవేట్టురాయర్‌తో ఆమెకు ఎలా పరిచయం ఏర్పడింది? లంకలో ఉన్న అరుణ్‌మొళిని చంపాలని ఎందుకు కుట్ర చేస్తుంది? అనేది రెండో భాగంలో తెలియనుంది
చోళరాజులపై పెద్ద పళవేట్టురాయర్‌కు ఎందుకు కోపం?
కోశాధికారిగా ఉన్న పెద్ద పళవేట్టురాయర్(శరత్ కుమార్).. రాజ్య చక్రవర్తి సుందరచోళుడి(ప్రకాశ్ రాజ్) అన్న కొడుకు మధురాంతకుడి(రెహమాన్)కి ఎందుకు మద్దతుగా నిలుస్తున్నాడు. ఒకవైపు కోశాధికారిగా ఉంటూనే... లోలోపల సామంత రాజులను ఎందుకు రెచ్చగొడుతున్నాడు? వయసులో తనకంటే చాలా చిన్నదైన నందినిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? సుందర చోళుడిపై ఎందుకు కోపం?
మధురాంతకుడి కోరిక నెరవేరేనా?
చోళ సామ్రాజ్యానికి ఎలాగైనా తానే అధిపతి కావాలని ఆశపడుతున్నాడు మధురాంతకుడు. తల్లి వద్దని చెప్పిన వారించినా.. వినకుండా కోశాధికారి పెద్ద పళవేట్టురాయర్‌తో చేతులు కలిపాడు. సామంత రాజులతో సమావేశమై పన్నాగాలు పన్నుతుంటాడు. మరి ఆయన ప్రయత్నాలు ఫలించాయా? చోళ రాజ్యానికి రాజు అయ్యాడా? లేదా బాబాయ్ కొడుకుల చేతిలో బలైపోయాడా? అనేది పార్ట్ 2లో తెలుస్తుంది.
రాజ్యాన్ని కాపాడడానికి కుందవై ఏం చేసింది?
చోళ రాజ్యానికి ఆపద ఉందని తెలుసుకున్న రాజకుమారి కుందవై(త్రిష).. తన రాజకీయ చతురతతో సామాంతుల రాజులను కలిసి .. వారి కుమార్తెలను తన సోదరులకి ఇచ్చి వివాహం చేస్తానని చెబుతుంది. దాంతో సామంత రాజుల మధ్య విభేదాలు వస్తాయి. మరి నిజంగానే వారి కుమార్తెలను తన సోదరులకు ఇచ్చి పెళ్లి చేసిందా? పెద్ద పళవేట్టురాయర్ కుట్రలను తన తెలివి తేటలతో ఎలా తిప్పికొట్టింది?
ఆ ముసలావిడా ఎవరు?
పొన్నియన్ సెల్వన్ క్లైమాక్స్.. అరుణ్‌మొళి సముద్రంలో పడిపోయినప్పుడు ఒక ముసలావిడ కాపాడానికి వస్తుంది. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి సముద్రంలో దూకేస్తుంది. అసలు ఆ ముసలావిడా ఎవరు? అరుణ్‌మొళిని కాపాడాల్సిన అవసరం ఆమెకేంటి? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి?
ప్రేమించిన నందినిని కరికాలుడు చంపేస్తాడా?
తన సోదరుడు అరుణ్‌మొళి చావుకు నందినినే కారణమని తెలుసుకున్న ఆదిత్య కరికాలుడు.. కోపంతో ఆమెను చంపడానికి తంజావురు వస్తాడు. మరి నిజంగానే నందినిని కరికాలుడు చంపేశాడా? లేదా ఆమె చేతిలోనే బలైపోయాడా? అనేది రెండో భాగంలో తెలియనుంది.
Comments
Please login to add a commentAdd a comment