ప్రస్తుత కాలంలో సినిమాలు ఒక్క వారం థియేటర్లలో ఆడటమే గగనంగా మారింది. అలాంటిది శతదినోత్సవ వేడుకలు సాధ్యమా? అంటే లవ్ టుడే అనే చిన్న చిత్రం సాధ్యమే అని నిరూపించింది. ఏజీఎస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించడంతో పాటు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. నటి ఇవాని హీరోయిన్‌గా నటించగా సత్యరాజ్, నటి రాధికాశరత్‌కుమార్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందించారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నవంబర్ 4వ తేదీన విడుదల చేసిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసి ఘన విజయాన్ని సాధించింది. దాదాపు రూ.100 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్ర శత దినోత్సవ వేడుకలను మంగళవారం రాత్రి చెన్నై చెట్‌పెట్‌లోని లేడీ ఆండాళ్ స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. దీనికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేదికపై చిత్ర దర్శక, కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. లవ్ టుడే చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు సాధించిందన్నారు. తాను కథానాయకుడిగా నటించిన ఈ సినిమా చతికిలబడితే మళ్లీ పైకి లేవడం కష్టం అని చాలా మంది ఎగతాళి చేశారన్నారు. మరికొందరేమో ఇది ఒక కొండలాంటిదని అన్నారన్నారు. అయితే తాను ఆలోచించింది ఏమిటంటే కొండ ఎక్కడం కష్టమా? అందుకు ఏం చేయాలి? తగిన పరికరాలు, శిక్షణ, శారీరక బలం, ఆక్సిజన్ వంటివి ఉండాలి కదా. అసలు ఎక్కడానికి ఆ కొండ కావాలి కదా.. అదే లవ్ టుడే చిత్రం అన్నారు. తనపై నమ్మకంతో అవకాశాన్ని కల్పించిన చిత్ర నిర్మాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment