టీవీ యాంకర్‌గా పేరు తెచ్చుకుని ఆపై బుల్లితెరకు, ఆ తర్వాత వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ప్రియా భవానీ శంకర్. కెరీర్ తొలినాళ్లలో పెద్దగా విజయాలు అందుకోని ఈ బ్యూటీ ప్రస్తుతం పెద్ద సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే శుక్రవారం(సెప్టెంబర్ 22) ప్రపంచ గులాబీ దినోత్సవం సందర్భంగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి ప్రియా భవానీ హాజరైంది.
క్యాన్సర్ ఆమెను బలి తీసుకోనివ్వను
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మా అమ్మ కూడా క్యాన్సర్ బాధితురాలే! గతేడాది తనకు క్యాన్సర్ సోకింది. అప్పుడు నన్ను కూడా టెస్ట్ చేయించుకోమన్నారు. అమ్మ అనారోగ్యానికి గురయినప్పుడల్లా నీకు త్వరలోనే నయమవుతుందమ్మా అని చెప్తూ ఉంటాను. ప్రారంభదశలోనే దాన్ని గుర్తించి చికిత్స చేయిస్తున్నాము. ఈ రోజు ఇక్కడ ఇంతమంది వారి అనుభవాలు చెప్పుకునేందుకు రావడం చూస్తుంటే చాలా ఎంకరేజింగ్‌గా ఉంది. క్యాన్సర్ మా అమ్మను బలితీసుకోనివ్వను. వైద్యులపై నాకు పూర్తి నమ్మకముంది' అంటూ స్టేజీపైనే కంటతడి పెట్టుకుంది హీరోయిన్. అనంతరం అక్కడున్న క్యాన్సర్ వ్యాధిగ్రస్తులతో మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపింది.
వరల్డ్ రోజ్ డే అంటే ఏంటి?
గులాబీ అనగానే చాలామందికి ప్రేమ, ప్రపోజల్ గుర్తొస్తుంది. అయితే గులాబీ కేవలం ప్రేమను తెలియజేసే నిర్వచనం మాత్రమే కాదు, క్యాన్సర్ మహమ్మారికి గుర్తు కూడా! క్యాన్సర్ రోగులు మనోధైర్యంతో ఉండాలనే సందేశాన్ని చాటిచెప్తూ సెప్టెంబర్ 22న ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే.. జీవించే సమయం తగ్గిపోవచ్చు.. కానీ, ప్రతిరోజు ఉదయించే సూర్యుడిని చూసిన ప్రతిసారి ఈరోజు గెలిచాను, జీవిస్తున్నాను అని ఫీల్ అవండి. ఈరోజు మృత్యువును జయించామని సంతోషించండి. అలా గెలిచిన ప్రతిరోజును ఆనందంగా గడుపుతూ మనసారా ఆస్వాదించండి.
Comments
Please login to add a commentAdd a comment