‘‘డిగ్రీ పట్టాలు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలుగా కాలేజీలు ఉండకూడదు. విద్యార్థులకు జ్ఞానసందను పంచాలి.. విలువలను కాపాడాలి. రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కు, పని హక్కు నిర్వీర్యం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అన్నారు దర్శకనిర్మాత, నటుడు ఆర్.నారాయణ మూర్తి. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై ఆయన నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాజా చిత్రం ‘యూనివర్సిటీ’. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘యువత జాతి సంపద. వారిని మనం కాపాడుకోవాలి. వారి మేధస్సు దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాలి. కానీ పేపర్ లీకేజీ వల్ల యువత తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. పేపర్ లీకేజీ అనే అంశం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా గమనిస్తూనే ఉన్నాం. పేపర్ లీకేజీల వల్ల విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతుంది.
విద్యార్థులు, ప్రభుత్వ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగుల భవిష్యత్తు ఏమైపోతుంది? అనే అంశాల ఇతివృత్తంగా ‘యూనివర్సిటీ’ సినిమా తీశాం. విద్య, వైద్య, విమానయానం, బ్యాంకింగ్, రైల్వేస్ వంటి రంగాల్లో ప్రైవేటీకరణ జరుగుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. వీటి వల్ల మైనార్టీలు, బడుగు, బలహీన వర్గాల వారు రిజర్వేషన్లు కోల్పోయి, ఉపాధి దక్కని పరిస్థితులు ఉండొచ్చు. ఆ అంశాలను కూడా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment