కాయకష్టం చేసుకుని బతుకును భారంగా ఈడ్చే వ్యక్తినే కూలీ అంటారు. అంతే కాకుండా డబ్బు కోసం ఎలాంటి పని చేసేవారినైనా కూలీనే అంటారు. వీటిలో నటుడు రజనీకాంత్ ఏ కోవకు చెందుతారో తెలియదు గానీ, ఇప్పుడు కూలీ పేరు మాత్రం నలుమూలలా మారుమ్రోగుతోంది. సినీ పరిశ్రమలో కూలీ టైటిల్ సక్సెస్‌కు అడ్రస్ అనుకుంటా. హిందీలో అమితాబచ్చన్ ఇదే పేరుతో చిత్రం చేసి సక్సెస్ అయ్యారు. ఇక తెలుగులో వెంకటేశ్ నటించిన కూలీ నెంబర్ 1 చిత్రం కూడా సూపర్‌హిట్ అయ్యింది. అలాగే తమిళంలోనూ నటుడు శరత్‌కుమార్ కూలీ పేరుతో చిత్రం చేశారు.
తాజాగా ఇదే టైటిల్‌తో సూపర్‌స్టార్ రంగప్రవేశం చేస్తున్నారు. అవును ఈయన కథానాయకుడిగా నటిస్తున్న 171వ చిత్రానికి కూలీ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. స్టార్ దర్శకుడు లోకేకనకాజ్ తెరకెక్కించబోతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌లో నిర్మిస్తోంది. ఇందులో చాలా కాలం తరువాత నటి శోభన రజనీకాంత్ సరసన నటించబోతున్నారని, మరో ముఖ్యపాత్రలో క్రేజీ నటి శృతిహాసన్, బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్‌సింగ్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.
అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇది వరకే విడుదల చేయగా అందులో రజనీకాంత్ గెటప్‌ను చూసి ఆయన అభిమానులు ఫిదా అయ్యారు. ఇక సమీప కాలంలో చిత్ర టైటిల్‌తోపాటు టీజర్‌ను విడుదల చేశారు. కూలీ టైటిల్, టీజర్‌లను చూస్తుంటే సరికొత్త రజనీకాంత్‌ను దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరపై ఆవిష్కరించనున్నారనేది సుస్పష్టం అవుతోంది. షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ కూలీ ప్రకంపనలు సృష్టిస్తోంది.
లోకేష్ కనకరాజ్‌కు తన చిత్రాల షూటింగ్ ప్రారంభానికి ముందే టీజర్‌ను విడుదల చేసి, సెన్సేషనల్ క్రియేట్ చేయడం ఆనవాయితీగా మారింది. ఆ మధ్య కమలహాసన్ హీరోగా చేసిన విక్రమ్ చిత్రం టీజర్‌లో ఆరంబిక్కలామా అనే డైలాగ్‌తో టీజర్‌ను రూపొందించి ఎగ్జైటింగ్‌కు గురి చేశారు. ఆ తరువాత విజయ్‌తో చేసిన లియో చిత్ర టీజర్‌లో బ్లడీ స్వీట్ అంటూ చిత్రంపై అంచనాలను పెంచేశారు.
తాజాగా రజనీకాంత్ హీరోగా చేస్తున్న కూలీ చిత్ర టీజర్‌లో ఏది తప్పు? ఏది ఒప్పు అనే డైలాగ్ చోటు చేసుకుంటుంది. అంతే కాకుండా కూలీ చిత్రం గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని, ఇందులో రజనీకాంత్ మరోసారి స్మగ్లర్‌గా నటిస్తున్నారని అర్థం అవుతోంది. ఇకపోతే ఇది కాస్ట్‌లీ చిత్రం అనడానికి మరో కారణం ఈ చిత్రం కోసం రజనీకాంత్ ఏకంగా రూ. 260 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు, అలాగే దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూ.60 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే గనుక నిజం అయితే దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు లోకేష్‌కనకరాజ్‌నే అవుతారు. కాగా కూలీ చిత్రం జూన్ నెలలో సెట్ పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటించగానే నటుడు ధనుష్ తన ఎక్స్ మీడియాలో మాస్ అని పేర్కొనడం మరో విశేషం.
Comments
Please login to add a commentAdd a comment