‘సినిమా వాతావరణంలో పుట్టిన నాకు ఏం చేసినా కొత్తగా ఉండాలనుకుంటాను. అందరిలా ఉండకూడదు అనేది నా తత్వం. తెర మీద కొత్తదనం చూడటానికే నేను థియేటరకి వెళ్తాను. థియేటర్‌లో కొత్తగా చూసింది... అంతకంటే కొత్తగా నేను చేయాలనుకుంటా. ఇప్పటి వరకూ అదే దారిలో వెళ్తున్నా. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలనే యాక్టర్ అయ్యాను’అన్నారు రానా దగ్గుబాటి. పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్‌లో సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న విడుదలైంది.
ఈ సందర్భంగా రానా బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘అసలు హీరో అంటే ఏంటి? అనేది ఈ సినిమాతో నేర్చుకున్నా. సినిమాలో మధ్యలో పాటలు, ఫైటులు ఎందుకు అనుకుంటాను. పాటలొస్తే కథ నుంచి బయటకు వచ్చేస్తాను. ఎందుకో వాటికి సింక్ అవ్వలేను. మాస్ సినిమా చేయాలని అందరూ చెబుతుంటే ఎందుకా అనుకునేవాడిని. అవి సినిమాకు ఎంత అవసరమో భీమ్లా నాయక్ చూశాక తెలిసింది. అయ్యప్పనుమ్ కోషియుమ్ కల్ట్ సినిమా. దానిని ఈ తరహాకు మార్పులు చేయాలంటే నటించే హీరోను బట్టే ఉంటుంది.
ఈ సినిమాలో నేను చేసిన డ్యాని పాత్ర చూసి నాన్న చాలా సంతృప్తి చెందారు. ఆయన అలా చెప్పడం చాలా అరుదుగా జరుగుతుంది. ‘బాహుబలి’ తర్వాత మళ్లీ ఈ సినిమాకే చాలా గొప్పగా చెప్పారు. ఏదో ఒక రోజు పాటలు, ఫైటులు లేకుండా టాకీతోనే సినిమా తీసి హిట్ కొడతా అని మా నాన్నతో చెబుతుంటా. అలాంటి ప్రయత్నం చేస్తా. ఇకపై అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలు చేస్తాను. సోషల్ మీడియాలో దాని గురించే చర్చ నడుస్తోంది. అలాంటి చిత్రాలు చేయాలని నాకూ ఇప్పుడే తెలిసింది’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment