![Randeep Hooda To Play Veer Savarkar In Biopic Directed By Mahesh Majrekar - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/24/VEER.gif.webp?itok=QU1p0vOL)
భారత స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరైన వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం వెండితెరపైకి రానుంది. ఈ బయోపిక్‌కు ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ రోల్‌లో బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా నటిస్తారు. మహేశ్ మంజ్రేకర్ దర్శకుడు. జూన్‌లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. లండన్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవుల్లో చిత్రీకరణను ప్లాన్ చేశారు.
‘'స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు కృషి చేశారు. అలాంటి వారిలో ప్రముఖులైన సావర్కర్‌గారి జీవితం అందరికీ తెలియాల్సి ఉంది’’ అన్నారు రణ్‌దీప్. 1883 మే 28న మహారాష్ట్రలో జన్మించారు దామోదర్ సావర్కర్. ఆ తర్వాత న్యాయవిద్యను అభ్యసించడం కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడి భారతీయ విద్యార్థుల్లో స్వాతంత్య్ర కాంక్షను ప్రేరేపించారాయన. హిందూ మహాసభల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు.
సావర్కర్ రాసిన ‘ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ బుక్‌ను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత 1910లో సావర్కర్‌ను అరెస్ట్ చేసింది బ్రిటీష్ ప్రభుత్వం. అండమాన్ నికోబార్ దీవుల్లోని జైల్లో పది సంవత్సరాలకు పైనే బ్రిటీష్ ప్రభుత్వపు శిక్షను అనుభవించారు సావర్కర్. 1966 ఫిబ్రవరి 26న ఆయన తుదిశ్వాస విడిచారు.
Comments
Please login to add a commentAdd a comment