Rang De Movie Review, Rating In Telugu, Nithin, Keerthy Suresh, Venky Atluri | ‘రంగ్‌దే’ మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

‘రంగ్‌దే’ మూవీ రివ్యూ

Published Fri, Mar 26 2021 12:29 PM | Last Updated on Sat, Mar 27 2021 1:34 PM

Rang De Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : రంగ్‌దే
జానర్‌:  రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్ 
నటీనటులు : నితిన్‌, కిర్తి సురేశ్‌, నరేశ్‌, వెన్నెల కిశోర్‌, కౌసల్య, బ్రహ్మజీ తదితరులు
నిర్మాణ సంస్థ : సితారా ఎంటర్‌టైన్‌మెంట్
దర్శకత్వం : వెంకీ అట్లూరి
సంగీతం : వీ శ్రీ ప్రసాద్ 
సినిమాటోగ్రఫీ : పీసీ శ్రీరాం 
ఎడిటింగ్ : నవీన్‌ నూలీ
విడుదల తేది : మార్చి 26, 2021

గతేడాది ‘భీష‍్మ’తో సూపర్‌ హిట్‌ అందుకున్న యంగ్‌ హీరో నితిన్‌.. ఈ ఏడాది ఆదిలోనే పరాజయాన్ని చవిచూశాడు. ఆయన హీరోగా నటించిన ‘చెక్‌’ మూవీ ఫిబ్రవరి 26న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘చెక్‌’ మూవీకి ప్రేక్షకులు చెక్‌ పెట్టారు. దీంతో ఈ సారి పక్కా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు నితిన్‌. ఇందులో భాగంగానే ‘తొలి ప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరితో కలిసి ‘రంగ్‌ దే’ మూవీ చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ చేశాయి. దీనికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేడయంతో ‘రంగ్‌దే’పై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘రంగ్‌దే’ టీమ్‌ అందుకుందా? నితిన్‌ కెరీర్‌లో 29వ సినిమాగా వచ్చిన ‘రంగ్‌దే’ని ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ
అర్జున్‌(నితిన్‌) చిన్నప్పటి నుంచి చదువులో వెనకబడతాడు. అదే పక్కింట్లోకి వచ్చిన అను(కీర్తి సురేష్‌) టాపర్‌. దీంతో ప్రతిసారి అర్జున్‌ వాళ్ల నాన్న(నరేశ్‌)అనుతో పోలుస్తూ అతన్ని తిడుతుంటాడు. ఇలా ఫస్ట్‌ క్లాస్‌ నుంచి బీటెక్‌ వరకు అను వల్ల అర్జున్‌కు తిట్లు పడుతూనే ఉంటాయి. దీంతో అర్జున్‌కు అను అంటే విపరీతమైన కోపం, ద్వేషం ఏర్పడుతుంది. కానీ అనుకు మాత్రం అర్జున్‌ అంటే ఇష్టం. పెద్దయ్యాక ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారుతంద. అర్జున్‌కు మాత్రం వయసుతో పాటు అనుపై కోపం పెరుగుతూనే వస్తుంది. ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ వార్ జరుగుతూనే ఉంటుంది. అయితే అనుకొని ఒక సంఘటన వల్ల అర్జున్‌ అనుని పెళ్లి చేసుకోవాల్సివస్తుంది. అనుతో మాట్లాడడానికే ఇష్టపడని అర్జున్‌ ఆమెను పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? పెళ్లి తర్వాత ఆమెతో కాపురం ఎలా చేశాడు? వారిద్దరి మధ్య గొడవలు అలానే నడిచాయా? లేదా ఒకరినొకరు అర్థం చేసుకొని సంసారం చేశారా? చివరికి వారిద్దరి ఇగోలు పక్కనపెట్టి ఎలా ఒక్కటయ్యారు అనేదే మిగతా కథ.

నటీనటులు
అల్లరిగా తిరిగే అర్జున్‌ పాత్రలో నితిన్‌ అద్భుతంగా నటించాడు. క్యూట్‌ అండ్‌ స్టైలీష్‌ లుక్‌తో అదరగొట్టాడు. కామెడీ స్లీన్లతో పాటు ఎమోషనల్‌ సన్నివేశాలలో అవలీలగా నటించాడు. నచ్చని భార్యతో కాపురం చేయమంటే ఎంత చికాకుగా ఉంటుందో అర్జున్‌ పాత్ర తెలియజేస్తుంది. ఇక మహానటి కీర్తి సురేష్‌ అల్లరి పిల్ల అను పాత్రలో జీవించేసింది. అమాయకంగా ఉంటూనే అర్జున్‌ని ఇరకాటంతో పడేస్తుంది. కొన్ని ఎమోషన్‌ సీన్లలో కూడా అవలీలగా నటించి నిజంగానే మహానటి అనిపించుకుంది. హీరో తండ్రి పాత్రలో నరేశ్‌ అలరించాడు. తనదైన శైలీలో కామెడీ చేస్తూ నవ్వులు పూయించాడు. ఇక హీరో స్నేహితులుగా ‘కలర్‌ ఫోటో’ ఫేమ్‌ సుహాస్‌‌, అభినవ్‌ గౌతమ్‌ పర్వాలేదనిపించారు. సెకండాఫ్‌లో వచ్చిన వెన్నల కిషోర్‌ ఉన్నంతలో కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. వినీత్‌, సత్యం రాజేశ్‌, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

విశ్లేషణ
ప‌క్క ప‌క్కనే ఉండే రెండు కుటుంబాల క‌థ ఇది. స‌హ‌జంగానే మ‌నం మ‌న ఇంట్లోవాళ్ల‌ను ప‌క్కింటివాళ్ల‌తో పోల్చి చూస్తుంటాం. ముఖ్యంగా చదువు విషయంలో ఈ పోలికలు మరీ ఎక్కువ. తమ బిడ్డ కంటే పక్కింటి వాళ్లు బిడ్డకు ఒక్క మార్కు ఎక్కువ వచ్చిన బాధపడే తల్లిదండ్రులు కోకొల్లలు. దీంతో పక్కింటి వాళ్లతో పోల్చడంతో సహజంగానే ఆ పిల్లల మధ్య అసూయ, ద్వేషం లాంటి ఏర్పడతాయి. ‘రంగ్‌ దే’ సినిమా నేపథ్యం  కూడా అదే. ఒకరంటే ఒకరికి పడని ఓ అబ్బాయి, ఓ అమ్మాయి మ‌ధ్య వ్యవహారం పెళ్లిదాకా వ‌స్తే ఎలాంటి ప‌రిస్థితులకు దారి తీస్తాయనేదే ‘రంగ్‌దే’ కథ.

దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పాలనుకున్న పాయింట్‌ను కాస్త ఎమోషనల్‌గా చూపించాలనుకున్నాడు. కానీ అది వర్కౌట్‌ కాలేదు. కథలో కొత్తదనం ఏమిలేదు కానీ తెరపై చూపించిన విధానం బాగుంది. ప్రేక్షకుడికి బోర్‌ కొట్టించకుండా కథనాన్ని సాగించాడు. హీరో హీరోయిన్ మధ్య ఇగో, క్లాషెస్ లాంటి సన్నివేశాలు ప్రేక్షకుడి అలరిస్తాయి. అను, అర్జున్‌ మధ్య జరిగే టామ్‌ అండ్‌ జెర్రీ వార్‌ ప్రేక్షకులను అట్రాక్ట్‌ చేస్తుంది. అయితే స్లో నెరెషన్‌ మాత్రం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. ఇంటర్వెల్‌లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం సెకండాఫ్‌పై మరింత ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఫ‌స్టాఫ్‌లో సినిమానే బాగానే న‌డిపిన‌, సెకండాఫ్ కాస్త దెబ్బ కొట్టించిన‌ట్టు అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య ఎమోషనల్ సీన్స్ కన్విన్సింగ్‌గా అనిపించవు. కథంతా రోటీన్‌గా సాగడం, దానికి తోడు ప్రతి సన్నివేశం పాత సినిమాలను గుర్తుకు తేవడం కాస్త ప్రతికూల అం‍శమే

ఇక ఈ సినిమాకు ప్రధాన బలం దేవి శ్రీ ప్రాసాద్‌ సంగీతం. ప్రతి పాట ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా అద్భుతంగా ఇచ్చాడు. ఎడిటర్‌ నవీన్‌ నూలి తన కత్తెర ఇంకాస్త పనిచెప్పాల్సింది. సెకండాఫ్‌లోని చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్‌ చేస్తే బాగుండనిపిస్తుంది. పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫి బాగుంది. ప్రతి సీన్‌ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తానికి రంగ్‌ దే స్టోరీ రొటీనే అయినప్పటికీ అర్జున్‌, అనుల టామ్‌ అండ్‌ జెర్రీ వార్‌ యువతను ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. 

ప్లస్‌ పాయింట్స్‌
నితిన్, కీర్తి సురేష్ నటన
కామెడీ సీన్స్‌
సంగీతం

మైన‌స్ పాయింట్స్‌:
రొటీన్ స్టోరి
స్లో నెరేషన్స్
సెకండాఫ్‌ సాగదీత సీన్లు
వర్కౌట్‌ కాని ఎమోషనల్‌ సీన్లు
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement