టైటిల్: రంగబలి
నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, సత్య, షైన్ టామ్ చాకో తదితరులు
నిర్మాణ సంస్థ: SLV సినిమాస్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం: పవన్ బాసంశెట్టి
సంగీతం: పవన్ సీహెచ్
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
విడుదల తేదీ: 07-07-2023
హీరో నాగశౌర్య పేరు చెప్పగానే మంచి క్లాస్ సినిమాలు గుర్తొస్తాయి. అలానే చాలాకాలం నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 'ఛలో' తర్వాత ఆ స్థాయి సక్సెస్ దక్కట్లేదు. ఇప్పుడు 'రంగబలి' అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో బ్లాక్ బస్టర్ కొట‍్టబోతున్నామని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గట్టిగా చెప్పుకొచ్చాడు. మరి ఈ మూవీ నాగశౌర్య చెప్పినట్లు ఉందా? సినిమా టాక్ ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథేంటి?
శౌర్య(నాగశౌర్య)ది రాజవరం. ఊరిలో బేవార్స్ గా తిరుగుతూ ఎక్కువగా షో చేస్తుంటాడు అందుకే అందరూ ఇతడిని 'షో' అని పిలుస్తుంటారు. ఊరంటే పిచ్చి ఇష్టం. చచ్చినా బతికినా సొంతూరిలోనే అనేది శౌర్య మనస్తత్వం. అలాంటిది ఓ పనిమీద వైజాగ్ వెళ్తాడు. అక్కడ సహజ(యుక్తి తరేజా)ని చూసి లవ్ లో పడతాడు. ఆమె కూడా ఇతడిని ప్రేమిస్తుంది. దీంతో పెళ్లి గురించి మాట్లాడేందుకు శౌర్య.. సహజ తండ్రి కలవడానికి వెళ్తాడు. తనది రాజవరం అని చెబుతాడు. తన ఊరిలోని 'రంగబలి' సెంటర్ ప్రస్తావన వస్తుంది. దీంతో ఆయన పెళ్లికి నో చెబుతాడు. ఇంతకీ ఆ సెంటర్‌తో శౌర్య పెళ‍్లికి వచ్చిన చిక్కేంటి? చివరకు శౌర్య ఏం చేశాడు? అనేదే మెయిన్ స్టోరీ.
ఎలా ఉందంటే?
తెలుగు కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమా అనగానే.. ఎలా ఉంటుందా అనేది మనకు ఓ ఐడియా ఉంది. దానికి ఏ మాత్రం అటు ఇటు కాకుండా 'రంగబలి' తీశారు. ట్రైలర్ లో చెప్పినట్లు.. బయట ఊరిలో బానిసలా బతకడం కంటే సొంతూరిలో సింహంలా బతకాలనేది హీరో క్యారెక్టరైజేషన్. ఫస్టాప్ మొదలవడమే మెల్లగా స్టోరీలోకి వెళ్లిపోయారు. మంచి ఎలివేషన్‌తో హీరో ఎంట్రీ. ఆ వెంటనే ఫైట్. ఆ తర్వాత హీరో చుట్టూ ఉండే వాతావరణాన్ని సీన్ బై సీన్ చూపించారు. తండ్రి విశ్వం(గోపరాజు రమణ)కి ఊరిలో మెడికల్ షాప్. కొడుకు శౌర్యకి దాన్ని అప్పగించాలని ఆయన ఆశ. మనోడేమో ఊరిలో కుర్రాళ్లతో బేవార్స్ గా తిరుగుతుంటాడు.
ఓ పనిమీద శౌర్య వైజాగ్ వెళ్లడం, అక్కడ హీరోయిన్ తో హీరో లవ్ లో పడటం, పెళ్లికి ఆమె తండ్రి ఒప్పుకోకపోవడం ఇలా సీన్లన్నీ వెళ్తుంటాయి. అయితే ఇలాంటి సన్నివేశాల్ని ఎక్కడో చూశామే అనిపించినప్పటికీ ఫస్టాప్ మొత్తం హీరో అతడి ఫ్రెండ్ అగాధం క్యారెక్టర్ చేసే కామెడీతో అలా వెళ‍్లిపోతుంది. పెళ్లి కోసం హీరోయిన్ తండ్రి దగ్గరకు వెళ్లిన హీరోకు తన ఊరిలో 'రంగబలి' సెంటర్ వల్ల ప్రాబ్లమ్ వస్తుంది. ఇంతకీ ఆ సెంటర్ తో హీరోయిన్ తండ్రికి ఉన్న సమస్యేంటి? చివరకు అది పరిష్కారమైందా లేదా అనేదే తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
దర్శకుడు ఓ పాయింట్ చెప్పాలనుకున్నాడు. దాన్ని కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమాగా తీశాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఫస్టాప్ మొత్తాన్ని స్టోరీ సెట్ చేయడానికి ఉపయోగించుకున్నాడు. సెకండాఫ్ లో అసలు విషయాన్ని బయటపెట్టాడు. కానీ అది ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసేసిన కథలా అనిపిస్తుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఏం కొత్తగా ఉండదు. క్లైమాక్స్ అయితే మరీ సిల్లీగా అనిపిస్తుంది. అప్పటివరకు మారని జనం.. హీరో 5 నిమిషాల స్పీచ్ ఇవ్వగానే మారిపోతారు. కొన్నేళ్ల ముందు వరకు ఈ తరహా స్టోరీలంటే ఓకే గానీ.. ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయిన ఈ జమానాలో కూడా ఇలాంటి స్టోరీలా బాసూ!
ఎవరెలా చేశారు?
హీరో నాగశౌర్యకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. తనదైన ఈజ్‌తో యాక్టింగ్, కామెడీ, డ్యాన్సులు అలా చేసుకుంటూ వెళ్లిపోయాడు. యాక్షన్ హీరో కావాలనే ఆరాటం ఈ సినిమాలో బాగానే కనిపించింది. అవసరం లేకున్నా సరే కొన్నిచోట్ల బాడీని చూపించాడు. ఫైట్లు కూడా చేశాడు. స్టోరీకి తగ్గట్లు అవి కాస్త లాజిక్‌గా ఉండుంటే బాగుండేది. హీరోయిన్ యుక్తి తరేజాకు పెద్దగా స్కోప్ దక్కలేదు. హీరోతో లవ్ సీన్లు, రెండు మూడు పాటల్లో కనిపించింది. ఓ పాటలో అయితే కిస్, స్కిన్ షోతో రెచ్చిపోయింది!
మిగిలిన వాళ్లలో సత్య గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. ఫస్టాప్ ని తన కామెడీతో లాక్కొచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఫస్టాప్ కి సత్యనే హీరో. లేకపోయింటే సినిమా బలైపోయేది! గోపరాజు రమణ హీరో తండ్రిగా నటించి ఆకట్టుకున్నాడు. సత్య, గోపరాజు రమణ పాత్రలకు ఫస్టాప్ లో దొరికిన స్పేస్.. సెకండాఫ్ లోనూ ఉండుంటే బాగుండేది. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో.. ఇందులో విలన్‌గా చేశాడు. అతడి పాత్ర పరిచయం ఓకే కానీ ఎండింగ్ పేలవంగా ఉంది. నటుడిగా ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. అసలు అతడి పాత్రకు సరైన సీన్లు ఒక్కటంటే ఒక్కటీ పడలేదు. సెకండాఫ్ లో శరత్ కుమార్, శుభలేఖ సుధాకర్ పర్వాలేదనిపించారు. మిగిలినవాళ్లు ఓకే.
టెక్నికల్ విషయాలకొస్తే.. పవన్ సీహెచ్ అందించిన పాటలు పెద్దగా గుర్తుండవు. అవి కూడా సందర్భం లేకుండా వస్తుంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. నిర్మాణ విలువలు స్టోరీకి తగ్గట్లు ఉన్నాయి. రైటర్ అండ్ డైరెక్టర్ పవన్ బాసంశెట్టికి ఇది తొలి సినిమా. కొన్ని సీన్లనీ బాగానే హ్యాండిల్ చేశాడు గానీ సినిమా కథ, సీన్లపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. ఓవరాల్‌గా చెప్పుకుంటే 'రంగబలి'.. కాస్త ఫన్ కాస్త ఎమోషన్ ఉండే రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్.
-చందు, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment