
తమిళసినిమా: శాండిల్ వుడ్‌లో చిన్న చిత్రం ద్వారా నటిగా పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఆ తరువాత ఛలో అనే చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంతోనే అదృష్టం వరించిందని చెప్పాలి. ఆ తరువాత నటించిన గీత గోవిందం చిత్ర విజయం.. రష్మిక దశనే మార్చేసింది. మధ్యలో కొన్ని కమర్షియల్ చిత్రాల్లో నటించినా అల్లుఅర్జున్‌కు జంటగా నటించిన పుష్ప చిత్రం ఈమెను బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిపోయింది. అక్కడ అమితాబ్‌బచ్చన్‌తో కలిసి నటించిన గుడ్‌బై చిత్రం వాణిజ్య రీత్యా విజయం సాధించకపోయినా రష్మికకు మంచి పేరే తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు చిత్రాలు, కోలీవుడ్‌లో ఒక చిత్రం చేస్తూ బిజీగా ఉంది. విజయ్‌కు జంటగా నటిస్తున్న ద్విభాషా చిత్రం వారీసు (తెలుగులో వారసుడు) చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. టాలీవుడ్‌లో నటించనున్న పుష్ప–2 చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. కాగా దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకోవడానికి సొంత ఊరికి వెళ్లింది. దీని గురించి ఆమె ఒక భేటీలో పేర్కొంటూ ఎంత బిజీగా ఉన్నా పండుగలు, పర్వదినాలను తన కుటుంబ సభ్యులతో జరుపుకుంటానని చెప్పింది.
అంతేకాకుండా ముఖ్యమైన పండుగ రోజుల్లో బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయటం అనేది తమ సెంటిమెంట్ అని చెప్పింది. ఇప్పుడు తన నూతన చిత్రాల ప్రారంభానికి ముందు బంగారం గానీ, వెండి గానీ కొనుగోలు చేస్తూ ఆ సెంటిమెంట్ కొనసాగిస్తున్నామని చెప్పింది. తనను, తన చెల్లిని ‘నాన్న.. మీరు మన ఇంటి మహాలక్ష్ములు’ అని తన తండ్రి అంటుంటారని చెప్పింది. అది తనకు చాలా గర్వంగా అనిపిస్తుందని, ఆ మహాలక్ష్మిని ఆహ్వానించడానికి తాము పండుగలకు ముందు బంగారం, వెండి ఆభరణాలను కొంటామని నటి రష్మికా మందన్నా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment