అలా చేస్తే నాకు పెళ్లవదన్నారు: హీరోయిన్‌ | Raveena Tandon About Adopt Decision They Said No One Would Want to Marry Me | Sakshi
Sakshi News home page

అలా చేస్తే నాకు పెళ్లవదన్నారు: హీరోయిన్‌

Published Mon, Jan 4 2021 4:32 PM | Last Updated on Mon, Jan 4 2021 6:36 PM

Raveena Tandon About Adopt Decision They Said No One Would Want to Marry Me - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌లు సుస్మితా సేన్‌, రవీనా టాండన్‌ వంటి వారు పెళ్లి చేసుకోకుండానే బిడ్డకు తల్లయ్యారు. చిన్నారులను దత్తత తీసుకుని.. అమ్మ అవ్వడానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని నిరూపించారు. ఇక సుస్మితా సేన్‌ నేటికి కూడా పెళ్లి ఊసు ఎత్తలేదు. కానీ రవీనా టాండన్‌ మాత్రం వివాహం చేసుకున్నారు. తాజాగా ఓ ఆంగ్ల మ్యాగ్‌జైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీనా పిల్లలని దత్తత తీసుకోవడం.. వారి పెంపకం.. ఎదుర్కొన్న పరిస్థితులు వంటి తదితర విషయాల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నా 21వ ఏట.. 1995లో ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుని వారికి తల్లిని అయ్యాను. అయితే నా నిర్ణయం పలు అనుమానాలను రేకెత్తించగా.. అనుభవం మాత్రం ఎన్నో సంతోషాలని ఇచ్చింది. ఇక పూజా, ఛాయలను దత్తత తీసుకున్నప్పుడు నా నిర్ణయాన్ని చాలా మంది ప్రశ్నించారు. ఇంత చిన్న వయసులో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రమాదం అని.. ఫలితంగా నా కెరీర్‌ ముగిసిపోతుందని.. ఇక నాకు పెళ్లవ్వదని భయపెట్టారు’ అని తెలిపారు రవీనా. (చదవండి: ‘అద్భుతం! ఉమ్మేయడం మళ్లీ మొదలవుతుంది)

అయితే ‘ఈ విషయాలు ఏవి నన్ను పెద్దగా ప్రభావం చేయ్యలేదు. పైగా నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఇది ఒకటి. తొలిసారి వారిని నా చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వారితో గడిపిన ప్రతి క్షణం నా జీవితంలో మధురమైన జ్ఞాపకం. నా బిడ్డలిద్దరికి సంబంధించిన ప్రతి సందర్భాన్ని నేను బాగా ఎంజాయ్‌ చేశాను. వారిద్దరూ దేవుడు నాకిచ్చిన వరం. ఇక పిల్లల తల్లిగా మారిన నన్ను ఎవరూ వివాహం చేసుకోరని బెదిరించారు. కానీ దేవుడు నన్ను ఎంతో ఉన్నతంగా నిలబెట్టాడు. గొప్పగా ఆశీర్వదించాడు’ అని తెలిపారు రవీనా. (చదవండి: ముగ్గురు డాన్స్‌.. కానీ ఒక్కరే!)

ఇక ఆ తర్వాత ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్‌ అనిల్‌ థడానిని వివాహం చేసుకున్నారు రవీనా. ఈ దంపతులకు కుమార్తె రాషా, కుమారుడు రణబీర్‌వర్ధన్ జన్మించారు. ఇక ప్రస్తుతం రవీనా దత్త పుత్రికలు ఛాయ ఎయిర్‌ హోస్టెస్‌గా పని చేస్తుండగా.. పూజ ఈవెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక గతంలో ఓ ఇంటర్వ్యూలో రవీనా తన ఇద్దరు కుమార్తెలు తన బెస్ట్‌ ఫ్రెండ్స్‌ని పేర్కొన్నారు. ఇక తన వివాహ సమయంలో ఇద్దరు తన పక్కన నిల్చుని మండపానికి తీసుకువచ్చారని.. ఇది తనకు ఎంతో ప్రత్యేక సందర్భం అని గుర్తు చేసుకున్నారు రవీనా. ఇక ప్రస్తుత రవీనా కేజీఎఫ్‌2 చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement