బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ప్రతి రోజు ఏదో ఒక మలుపు చోటు చేసుకుంటుంది. తాజాగా సుశాంత్ ప్రేమికురాలు రియా చక్రవర్తి, నిర్మాత మహేష్ భట్‌ల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ తెర మీదకు వచ్చింది. ఈ కేసును విచారిస్తున్న అధికారులు దీనిని మీడియాకు అందించారు. ఈ సంభాషణ జూన్ 8 తర్వాత అంటే రియా, సుశాంత్ ఇంటి నుంచి వెళ్లి పోయిన తర్వాత జరగడం గమనార్హం. ఈ మెసెజ్‌లలో రియా ‘అయేషా మూవ్స్ ఆన్ సర్.. ఇప్పుడు చాలా ఉపశమనంగా’ ఉంది అంటూ మహేష్ భట్‌కు మెసేజ్ చేసింది. అయేషా అనేది ‘జలేబి’ చిత్రంలో రియా చక్రవర్తి పోషించిన పాత్ర పేరు. దీనికి మహేష్ భట్ నిర్మాత.
ఆ తర్వాత ‘మీరు నాకు చేసిన చివరి కాల్ వేక్ అప్ కాల్ లాంటిది. మీరు నా ఏంజెల్.. ఇప్పుడు ఎప్పుడు’ అని రియా మెసేజ్ చేస్తే.. అందుకు మహేష్ భట్.. ‘ఇక వెనక్కి తిరిగి చూడకు.. అనివార్యమైన దాన్ని సాధ్యం చేయండి. మీ తండ్రికి నీ ప్రేమ.. అతను సంతోషంగా ఉంటాడు’ అని రిప్లై ఇచ్చాడు. అందుకు రియా ‘ఆ రోజు మీరు మా నాన్న గురించి ఫోన్‌లో చెప్పిన మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. నేను బలంగా ఉండటానికి కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చాయి’ అంటూ వారి సంభాషణ కొనసాగింది. ఈ సందేశాలు పోలీసులకు, ఇతర ఏజెన్సీలకు రియా చెప్పిన విషయాల ప్రామాణికత గురించి ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. పూర్తి సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. (రియా కాల్ రికార్డు: మహేష్ భట్‌కు 16 కాల్స్)
రియా మాత్రమే సమాధానం చెప్పగల ప్రశ్నలు
ఇక విచారణలో రియా పోలీసులకు సుశాంత్‌తో బంధం తన తండ్రికి ఇష్టం లేదని... మహేష్ భట్ కూడా తమ రిలేషన్ గురించి హెచ్చరించారని తెలిపింది. అంతేకాక రియా తన సన్నిహితులకు సుశాంత్ వ్యాధి గురించి చెప్పడమే కాక.. దాని వల్ల తాను ఎంతో ఇబ్బందిపడుతున్నట్లు వారి దగ్గర వాపోయినట్లు సమాచారం. ప్రస్తుతం సీబీఐ అధికారులు జూన్ 8న రియా చక్రవర్తి, సుశాంత్‌ల మధ్య ఏం జరిగిందనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సుశాంత్ ఇంటి నుంచి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే దాని గురించి ఆమె మాత్రమే సరిగ్గా చెప్పగలదని సీబీఐ భావిస్తోంది. (అలా బయటకు కనిపిస్తారా?)
జూన్ 8న ఏం జరిగింది అంటే..
రియా తరఫు న్యాయవాది సతీష్ మనేషిందే విడుదల చేసిన ఓ ప్రకటనలో ‘సుశాంత్ ముంబై నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. దాంతో తన కుటుంబ సభ్యులను తన దగ్గరకు రావాల్సిందిగా ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు. అతడి సోదరి శ్వేత జూన్ 8న సుశాంత్‌ని కలవడానికి అంగీకరించింది. అందువల్ల సుశాంత్ రియాను ఆమె అమ్మనాన్నల దగ్గరకు వెళ్లమని కోరాడు. కానీ సుశాంత్‌తో కలిసి ఉన్నప్పటి నుంచి రియా కుటుంబం ఆమెతో సరిగా మాట్లాడటం లేదు. దాంతో వారి వద్దకు వెళ్లడానికి రియా ఇబ్బంది పడింది. జూన్ 8న రియా సుశాంత్ కోసం సుసాన్ వాకర్‌తో థెరపి సేషన్‌ని ఏర్పాటు చేసింది. అది పూర్తయ్యాక వెళ్తానని కోరింది. కానీ సుశాంత్ వెంటనే ఆమెని అక్కడి నుంచి వెళ్లిపోమ్మని అభ్యర్థించాడు. దాంతో రియా అఇష్టంగానే అక్కడి నుంచి వెళ్లి పోయింది. ఏదైనా అవసరం ఉంటే తనకు లేదా తన సోదరుడికి కాల్ చేయమని సుశాంత్‌కు చెప్పి రియా అతడి ఇంటి నుంచి వెళ్లి పోయింది’ అని ఈ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment