ఏదైనా నిగ్గదీసి అడిగే చైతన్యం ఆమె సొంతం | Sakshi TV Special Interview Singer Chinmayi Sripada | Sakshi
Sakshi News home page

ఆమె సినిమాలకు పాడతారు... కానీ ఛాన్స్‌ కోసం చెప్పినట్టు ఆడరు

Published Sun, Mar 7 2021 4:15 AM | Last Updated on Sun, Mar 7 2021 8:20 AM

Sakshi TV Special Interview Singer Chinmayi Sripada

చిన్మయి శ్రీపాద

ఆమె సినిమాలకు పాడతారు... కానీ ఛాన్స్‌ కోసం వాళ్ళు చెప్పినట్టు ఆడరు. ఆమె స్టార్లకు గొంతు అరువిస్తారు... కానీ రాజీ పడి గొంతు విప్పద్దంటే ఊరుకోరు. ఆమె జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు... అయినా సరే తారాలోకంలోని తప్పులుచూసి తల వంచుకు వెళ్ళిపోరు! ఆమె గళంలో ఆవేశం ఉంది. ఆమె అక్షరంలో ఆవేదన ఉంది. ఆమెకంటూ భిన్నమైన ఆలోచనా ఉంది. ఆధునిక స్త్రీ చైతన్యానికి ఓ ప్రతీక – సినీ గాయని చిన్మయి శ్రీపాద. ఏదైనా నిగ్గదీసి అడిగే ఆమె చైతన్యం... ఇవాళ సమాజంలో... ముఖ్యంగా సినీ రంగంలో... ప్రతిధ్వనిస్తున్న చిన్మయ నాదం! చిన్మయ వాదం!!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా – సాక్షి టీవీ స్పెషల్‌ ఇంటర్వ్యూలో చిన్మయి శ్రీపాద పంచుకున్న మనోభావాలు...

► మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏడాదీ సెలబ్రేట్‌ చేసుకుంటాం. కానీ ఇలాంటి ఓ రోజు ఉంది అంటే... ఇందు కోసం చాలామంది మహిళలు ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు. దాడులకు లింగభేదం లేదు. అమ్మాయిలపైనే కాదు, అబ్బాయిలపైనా జరుగుతున్నాయి.   

► మహిళా దినోత్సవం అని ఏడాదికోసారి మనం జరుపుకొంటున్నాం. ఆ తర్వాత మనం మహిళల గురించి మర్చిపోతున్నాం. ‘కట్నం ఇవ్వకూడదు... అడగకూడదు’ అని మన దేశంలో చట్టం ఉంది. కానీ అమ్మాయికిచ్చే కట్నం మీదే ఆమె లైఫ్‌ అంతా తిరుగుతోంది. ఇటీవల రష్మీ అనే అమ్మాయి 7 కోట్ల కట్నం ఇచ్చింది. కానీ వేధింపుల వల్ల చనిపోయింది. సో... ఒక అమ్మాయి ఎంత బాధ భరించినా ఫర్లేదు. పెళ్లి చేస్తే చాలనుకుంటున్నారు. చట్టాలున్నా భ్రూణహత్యలు చేస్తున్నారు.

► సోషల్‌ మీడియాలో ‘అమ్మాయి లంటే ఇలానే ఉండాలి’ అని కొన్ని మీమ్స్‌ ఉంటాయి. ‘మేం మగాళ్లం, ఫెమినిజం గురించి కూడా మేమే చెబుతాం’ అంటారు.

► ఇప్పటికీ మహిళలపై లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్, గృహహింస జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిలపై ఇవి నార్మలే... జరుగుతాయి అంటారు. ఎబ్యూజ్‌ అనేది నార్మల్‌ అని మన పేరెంట్స్‌ మనకు చెబుతున్నారు. కానీ ఎబ్యూజ్‌ అనేది ఎందుకు నార్మల్‌? ఒక అమ్మాయిగా నేను ఎందుకు ఎబ్యూజ్‌కు గురి కావాలి?

► దిశ కేసులో కూడా చూడండి. ‘ఆమె దుప్పటా వేసుకుందా? ఆ టైమ్‌లో ఆ అమ్మాయి అక్కడ ఏం చేస్తోంది? అప్పుడు పెద్ద టైమ్‌ కూడా కాలేదు’ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు. అర్ధరాత్రి ఓ మహిళ ఒంటరిగా తిరిగినప్పుడు మనకు స్వాతంత్య్రం వచ్చినట్లు అని గాంధీజీ చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ పరిస్థితులు లేవు.

► వైరముత్తు గురించి నేను మొదట్లో మాట్లాడకపోవడానికి కారణం మా అమ్మగారు నన్ను మాట్లాడనివ్వకపోవడమే! మనల్ని ఎవరు సపోర్ట్‌ చేస్తారు? సొసైటీలో మనకెలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని భయపడ్డారు.

► సోషల్‌ మీడియాలో నాపై రేప్‌ థ్రెట్‌ వస్తే  కేసు పెట్టాను. 2011 నుంచి ఆ కేస్‌ నడుస్తూనే ఉంది. ఇండియాలోనే ఫస్ట్‌ సైబర్‌ క్రైమ్‌ కేస్‌ అది.

► చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల గురించి మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. కానీ ఇప్పటికీ రాలేదు. ఎందుకంటే ఎక్కువగా మగాళ్ళే ఉన్నారు కదా! ఇక, ఒక కంపెనీలో 10మంది ఉద్యోగులుంటే ఐసీసీ అనేది (ఇంటర్నల్‌ కంప్లయింట్స్‌ కమిటీ) ఉండాలి అనేది రూల్‌. విశాఖ గైడ్‌లైన్స్‌కి తగ్గట్లు అన్ని ఆఫీసుల్లో కమిటీలు న్నాయా? ఎన్ని కంపెనీలు ఫాలో అవుతున్నాయి.

► ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడటాన్ని సమాజంలో పెద్ద క్రైమ్‌గా చూస్తారు. ఆ అమ్మాయి, అబ్బాయి ఫ్రెండ్స్‌ అయ్యుండొచ్చు.  ఒకవేళ వాళ్లు లవ్‌లో ఉంటే వారి తల్లితండ్రులతో మాట్లాడుకుంటారు. అంతేకానీ... అదొక పెద్ద నేరంలా చూడకూడదు. ఒక అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకోవడమే తప్పు అనే కల్చర్‌ మారాలి. కల్చర్‌ అంటే... నిరంతరం మారుతూ ఉండేది. మనం 1852లో ఎలా ఉన్నాం? ఇప్పుడు ఎలా ఉన్నాం? టైమ్‌తో పాటు మారాలి. పాతకాలంలోలాగానే ఉండాలనుకుంటే టీవీలు చూడకూడదు. ఇంటర్‌నెట్‌ వాడకూడదు.

► ‘నువ్వు..మగాడివికాబట్టి ఏడవకూడదు. బాధపడకూడదు’ అంటారు. అమ్మాయిలు మేకప్‌ వేసుకోవడానికి మూడు నాలుగు గంటలు పడుతుంది అని మాట్లాడుతుంటారు. కానీ మేకప్‌ ఆర్టిస్టు, హెయిర్‌ డ్రెస్సింగ్‌ల పని గురించి కూడా ఆలోచించాలి. మేల్‌ యాక్టర్‌కు ఫిమేల్‌ హెయిర్‌ డ్రెస్సరెందుకు ఉండకూడదు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి వర్క్‌ చేసే మహిళ భానుగారు మేకప్‌ ఉమన్‌గా యూని యన్‌లో గుర్తింపు కోసం కోర్టుకు వెళ్ళాల్సొచ్చింది.  

► నేను సింగర్‌గా వచ్చి 19 ఏళ్లు. నాతో మిస్‌ బిహేవ్‌ చేసింది వైరముత్తు ఒక్కరే. మంచివాళ్ళు చాలా మంది ఉన్నారు. కొద్దిమంది వల్లే ఇండస్ట్రీకి చెడ్డపేరు.

► నేను ఓపెన్‌గా మాట్లాడుతున్నాను అంటే నాకు మా ఆయన (నటుడు రాహుల్‌ రవీంద్రన్‌) మంచి సపోర్ట్‌ ఇచ్చారు. చాలామంది అమ్మాయిలు ఎందుకు బయటకు చెప్పడం లేదంటే వాళ్ల తల్లితండ్రులే ఫ్రీడమ్‌ ఇవ్వరు. అన్నదమ్ములే తమ సిస్టర్‌ను తప్పుపడుతున్నట్లు మాట్లాడుతున్నారు. చైన్‌  స్నాచింగ్‌ గురించి, బ్యాగ్‌ దొంగతనం గురించి చెప్పొచ్చు. కానీ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ గురించి బయటకు చెబితే, అందులో అమ్మాయిల తప్పు ఉన్నట్లు మాట్లాడతారు. దొంగతనం కేసుల్లో దోషులను తప్పుపడితే.... హెరాస్‌మెంట్‌ కేసుల్లో మహిళలదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు.

► రేప్‌ కేసుల్లో కూడా తొందరగా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అలాగే సెక్స్‌ ఎడ్యుకేషన్‌  కూడా కావాలి. ఇప్పుడు రద్దీ బస్సులో ఒక ఆకతాయి గిల్లితే గిల్లాడు లెమ్మని అమ్మాయిలు చెప్పలేరు. దానికి సాక్ష్యం అంటే ఏం చూపిస్తాం?  

► 21వ శతాబ్దంలోనూ సినిమాల్లో మహిళలను భోగవస్తువులుగా చూడటం తగ్గడం లేదు. అమ్మాయి ఒక బికినీ కానీ, చిన్న షార్ట్‌ కానీ వేసుకుంటే... కెమెరా చూపిస్తుంది ఎక్కడ చూడాలనేది! ఇంగ్లీష్‌ సినిమాల్లో బికినీ హీరోయిన్స్‌ను మామూ లుగానే చూపిస్తారు. కానీ మన సినిమాల్లో కెమెరా జూమ్‌లో చూపిస్తుంటారు.

► సమంత వండర్‌ వుమన్‌ . సమంత కూడా లైంగికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొని, గెలిచారు. సమంతకూ, నాకు పూర్వజన్మ కనెక్షన్‌  ఉందనుకుంటా. రాహుల్, సమంత ఓ తమిళ సినిమా ద్వారా కెరీర్‌ను స్టార్ట్‌ చేశారు. నా తెలుగు డబ్బింగ్‌ కెరీర్‌ సమంత ద్వారానే మొదలైంది. నా కంటే ముందు రాహుల్, సమంత మంచి ఫ్రెండ్స్‌.

► నా భర్త రాహుల్‌ నా కన్నా పెద్ద ఫెమినిస్టు. విపరీతంగా చదివే రాహుల్‌ నన్ను మార్చాడు. క్యాస్టిజమ్, సెక్సిజమ్‌ గురించి రాహులే నాకు ఎక్కువ చెప్పాడు. మహిళల డ్రెస్‌తో సంబంధం లేకుండా వారి ఫేస్‌లు చూసే మాట్లాడాలన్నది రాహుల్‌ నుంచే నేను నేర్చుకున్నా. రాహుల్‌ నన్ను సపోర్ట్‌ చేస్తున్నాడు కాబట్టే మేము ప్రశాంతంగా ఉన్నాం. మా ఫ్యామిలీ అంతా బాగుంది.

► సినీ గీత రచయిత వైరముత్తు దుష్ప్రవర్తన గురించి ఓపెన్‌ గా చెప్పా. కానీ, తమిళ డబ్బింగ్‌ యూనియన్‌  ప్రెసిడెంట్‌ రాధా రవి నన్ను బ్యాన్‌  చేశారు. కోర్టుకు వెళ్లా. ఇప్పటికీ పోరాడుతున్నా. సింగర్‌గా ఛాన్సులు తగ్గిపోయాయి. బాధగానే ఉంది. కానీ మా ఇంట్లో నన్ను సపోర్ట్‌ చేస్తున్నారు. నాకు కూడా కొన్ని వార్నింగ్‌లు వచ్చాయి. ‘పొలిటికల్‌ పార్టీల గురించి మాట్లాడితే ఐటీ రైడ్స్‌ జరుగుతాయి’ అని చెప్పారు.

► జర్నలిస్టు ఎం.జె. అక్బర్‌ లైంగిక వేధింపులపై 20 మంది మహిళా జర్నలిస్టులు ఆరోపించారు. ప్రియా రమణి వర్సెస్‌ అక్బర్‌ కేసులో తాజా తీర్పు రిలీఫ్‌. కానీ, నువ్వు రేప్‌ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని రీసెంట్‌గా ఓ జడ్జ్‌ అడిగారు. చాలా విషయాలు నేను ఓపెన్‌గా మాట్లాడతా. నా గురించి నేను ఆలోచించను. సొసైటీకి మంచి జరిగితే చాలు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement