
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సీబీఐ విచారణ మొదలైన నాటి నుంచి అతడి గర్ల్‌ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె.. జూన్ 8న తాను బాంద్రా ఫ్లాట్ నుంచి వచ్చేశానని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని చెబుతున్నారు. అంతేగాక సుశాంత్ ఎప్పటి నుంచో డ్రిపెషన్‌లో ఉన్నాడని, అతడి మాజీ ప్రేయసి అంకితా లోఖండేపై పలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో గురువారం ఇండియా టుడేతో మాట్లాడిన రియా చక్రవర్తి.. ‘దిల్ బేచారా’ హీరోయిన్ సంజనా సంఘీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌పై వచ్చిన మీటూ ఆరోపణలపై స్పష్టతనివ్వడంతో సంజన ఆలస్యం చేసిందని, ఈ పరిణామాలు అతడిని కుంగదీశాయని చెప్పుకొచ్చారు. (చదవండి: సుశాంత్ గంజాయి తాగేవాడు: రియా)
లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా సుశాంత్ మానసికంగా బలహీనపడిపోయాడని, ఆ ఎపిసోడ్ తనను పూర్తిగా నాశనం చేసిందని పేర్కొన్నారు. ‘‘మీటూ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకు ఎందుకు ఆలస్యం చేశారు? ఈ విషయంపై విచారణ జరగాలి. నెలన్నరగా నేనెందుకు మౌనంగా ఉన్నానని ప్రశ్నించిన వాళ్లు ఈ విషయంపై దృష్టి సారించాలి’’అంటూ రియా వ్యాఖ్యానించారు. ఇక రియా వ్యాఖ్యలపై సంజన సంఘి తీవ్రంగా స్పందించారు. కాస్మోపాలిటన్ ఎడిటర్‌తో మాట్లాడుతూ.. ‘‘ఓ మహిళగా నేనేం ఏం చెప్పాలో అంతా చెప్పాను. జరిగిన దాని గురించి పూర్తిగా వివరించాను. మళ్లీ కొత్తగా ఇలా మాట్లాడితే అస్సలు సహించేది లేదు’’రియాపై ఫైర్ అయ్యారు. (చదవండి: సుశాంత్, రియా కోసం ఎంత ఖర్చు చేశాడంటే..)
లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు లేక సతమతమవుతుంటే.. తనను వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. సహ నటిగా సుశాంత్ గురించి తాను కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకోగలిగాని, ఒకరి జీవితంలో తలదూర్చే ప్రయత్నం చేయనని చెప్పుకొచ్చారు. దిల్ బేచారాకు ముందు తానెన్నడూ సుశాంత్‌ను కలవలేదని, అయితే సెట్లో తనను గమనించిన దాన్నిబట్టి ఎంతో మంచి వ్యక్తి చెప్పగలనన్నారు. ఇక సుశాంత్ మృతి తన మనసును కలచివేసిందన్న సంజన.. అతడికి న్యాయం జరగాలని ఆకాంక్షించారు. ఇలాంటి సమయంలో కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేయకూడదని పరోక్షంగా రియాను ఉద్దేశించి చురకలు అంటించారు.(చదవండి: దిల్ బేచారా మూవీ రివ్యూ)
కాగా ‘దిల్ బేచారా’ సినిమాలో సుశాంత్, సంజన జంటగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో(2018) సుశాంత్ ఆమెను లైంగికంగా వేధించాడంటూ వదంతులు వ్యాపించాయి. వీటిపై క్లారిటీ ఇస్తూ సంజనతో తాను చేసిన చాట్‌ను బహిర్గతం చేసిన సుశాంత్, తనతో హుందాగా ప్రవర్తించానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత నెలరోజులకు ఈ విషయంపై స్పందించిన సంజన..‘‘యూఎస్ ట్రిప్ నుంచి నిన్ననే తిరిగి వచ్చాను. సెట్లో నేను వేధింపులకు గురయ్యానని వార్తలు వస్తున్నాయి. నిజానికి అలాంటి సంఘటనలేమీ జరగలేదు. అవన్నీ అబద్ధాలే. ఇక వాటికి స్వస్తి పలికితే మంచిది’ అంటూ ట్వీట్ చేశారు.