హీరో నుంచి విలన్ దాకా ఎటువంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల ఉద్ధండుడు శరత్ బాబు. నాలుగున్నర దశాబ్దాల కాలంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనేక చిత్రాలు చేశారు. తెలుగులో కన్నా తమిళనాట శరత్ బాబుకు ఎక్కువ ఆదరణ లభించిందని చెప్పవచ్చు. వందలాది సినిమాలు చేసిన ఆయన తన దగ్గరకు వచ్చే ఏ పాత్రనైనా ప్రాణం పెట్టి చేస్తారు. శరత్‌బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. 1951 జూలై 31న ఆంధ్రప్రదేశ్‌లోని ఆముదాలవలసలో జన్మించారు. శరత్‌బాబు తండ్రి సత్యనారాయణ దీక్షిత్‌కు మొత్తం పదమూడుమంది సంతానం. అందులో నాలుగోవాడే శరత్‌బాబు.
ఆ సలహాతో రూటు మారింది..
సత్యనారాయణకు అప్పట్లో పెద్ద హోటల్ ఉంది. తన తదనంతరం కొడుకే హోటల్ చూసుకుంటాడని ఆయన భావించారు. కానీ శరత్‌బాబుకు మాత్రం పోలీస్ కావాలని ఉండేది. ఫ్రెండ్స్, టీచర్లు అంతా నువ్వు హీరోలా ఉంటావు, సినిమాల్లో ట్రై చేయకపోయావా? అని సలహా ఇచ్చారు. ఈ మాటలు శరత్‌బాబు తల్లిని ఆలోచింపజేశాయి. తండ్రికి ఇష్టం లేకపోయినా తల్లి ప్రోత్సాహంతో మద్రాసు చేరి అవకాశాల కోసం ప్రయత్నించారు శరత్ బాబు.
వెయ్యి మందిలో ట్రై చేస్తే శరత్‌కు దక్కిన ఛాన్స్
ఆ సమయంలో రామవిజేత సంస్థ నూతన నటీనటుల కోసం పేపర్‌లో ప్రకటన ఇచ్చింది. దాదాపు వెయ్యి అప్లికేషన్లు వస్తే ముగ్గుర్ని సెలక్ట్ చేశారు. ఆ ముగ్గురికీ స్క్రీన్ టెస్ట్ చేసి అందులో శరత్‌బాబును హీరోగా సెలక్ట్ చేశారు. అలా 1973లో రామరాజ్యం సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు శరత్. అమెరికా అమ్మాయి, బంగారు మనిషి, పంతులమ్మ, చిలకమ్మ చెప్పింది, సీతాకోక చిలుక ఇలా వరుస సినిమాలు చేస్తూ నటుడిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న రోజులవి..
వయసులో తనకంటే పెద్దదైన రమాప్రభతో ప్రేమ.. పెళ్లి
అప్పటికే కమెడియన్‌గా స్టార్ హోదాలో ఉన్న రమాప్రభతో పరిచయం ఏర్పడటం, అది ప్రేమకు దారి తీయడంతో వీరి పెళ్లి కూడా జరిగిపోయింది. రమాప్రభ.. శరత్‌బాబు కంటే నాలుగేళ్లు పెద్దది. 14 ఏళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న ఈ దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం ప్రముఖ తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహలతను పెళ్లాడగా ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఆమెకు సైతం విడాకులిచ్చేశారు.
ఆ 25 మంది తన పిల్లలే..
ఆ తర్వాత నమితను పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది కానీ అదంతా వుట్టి పుకారు అని ఆయనే స్వయంగా కొట్టిపారేశారు. అయినప్పటికీ ఆయన సీక్రెట్‌గా ఎవరినో మూడో పెళ్లి చేసుకున్నారన్న ప్రచారం మాత్రం ఆగలేదు. ఇక తన పిల్లల గురించి ప్రశ్న ఎదురైనప్పుడల్లా తన అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల పిల్లలు 25 మంది తన తన పిల్లలే అని సరదాగా చెబుతుండేవారు. శరత్‌బాబుకు ఎటువంటి దురలవాట్లు లేవు. తను పూర్తి శాకాహారి.
చదవండి: శరత్‌బాబు ఇక లేరు
Comments
Please login to add a commentAdd a comment